
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న అంశాల్లో కేవైసీగా పిలిచే ‘నో యువర్ కస్టమర్’ విధానం కచ్చితం చేయడం సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఇప్పటి వరకు కేవైసీ యాడ్ చేసుకోవాలంటూ టోకరా వేసి అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా దాని గడువు ముగిసిందని, ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవాలంటూ ఫోన్లు చేస్తున్నారు. తమ వల్లో పడిన వారి స్మార్ట్‌ఫోన్లలో ‘ఎనీ డెస్క్’ యాప్ డౌన్‌లోడ్ చేయించి నిండా ముంచుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా కేసుల సంఖ్య పెరిగిందని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వివిధ మార్గాల్లో డేటా సేకరణ..
ఈ తరహా మోసాలు చేసే వారికి వివిధ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న, ఆర్థిక లావాదేవీలు చేయడానికి వాలెట్ వినియోగిస్తున్న వారి వివరాలు తెలియడం ముఖ్యం. ఈ సైబర్ నేరగాళ్లు డార్క్ నెట్‌తో పాటు వివిధ మార్గాల్లో ఆ డేటాను సంగ్రహిస్తున్నారు. ఆపై ఆయా వినియోగదారులకు ఫోన్లు చేస్తూ తాము ఫలానా బ్యాంకు/వాలెట్ ప్రతినిధులమని పరిచయం చేసుకుంటున్నారు. ఈ కాల్ అందుకుంటున్న వారి ఆ బ్యాంకు ఖాతాదారుడు కావడమో, వాలెట్ వినియోగిస్తుండటమో చేస్తుండటంతో వారు సైబర్ నేరగాళ్ల వల్లో పడుతున్నారు. గతంలో అప్‌లోడ్ చేసిన కేవైసీ గడువు ముగిసిందనో, అది ఇన్‌వ్యాలీడ్‌గా మారిందనే చెప్పే సైబర్ నేరగాళ్లు ఖాతా బ్లాక్ కాకుండా ఉండాలంటే తక్షణం ఆన్‌లైన్‌లో మరోసారి కేవైసీని పొందుపరచాలని నమ్మబలుకుతున్నారు.
టీమ్‌వ్యూవర్ తరహా యాప్..
ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్స్ వినియోగించే వారు ఓ సమూహంగా సమాచార మార్పిడి చేసుకునేందుకు, సందేహాల నివృత్తికి టీమ్ వ్యూవర్ అనే అప్లికేషన్ వాడుతుంటారు. సైబర్ నేరగాళ్లు సైతం ఇదే కోవకు చెందిన ఎనీ డెస్క్ యాప్‌ను ఎరగా వేస్తున్నారు. కేవైసీ ఆన్‌లైన్‌లో వాలిడేషన్ చేయించడానికి క్లిక్ చేయాలంటూ ఓ లింకును వినియోగదారుడికి పంపిస్తున్నారు. దీనిని అందుకునే వ్యక్తి ఆ లింకు క్లిక్ చేయగానే వారి ఫోన్లలో ఎనీ డెస్క్ యాప్ ఇన్‌స్టల్ అయిపోతోంది. ఈ యాప్ సైబర్ నేరగాడి వద్ద ఉన్న మరో స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించి ఉంటుంది. ఆ విధంగా ఈ లింకును వారు ముందే సెట్ చేసి ఉంచుతారు. ఫలితంగా దీన్ని ఇన్‌స్టల్ చేసుకున్న వ్యక్తి తన ఫోన్ కీ ప్యాడ్ ద్వారా టైప్ చేసే ప్రతి అక్షరం సైబర్ నేరగాడు చూడగలుగుతాడు.
చిన్న లావాదేవీ చేయమంటూ...
ఎనీ డెస్క్‌ను ఇన్‌స్టల్ చేసుకుని, అందులో వివరాలు పూరించిన తర్వాత సైబర్ నేరగాళ్లు మరో అంకం మొదలెడుతున్నారు. కేవైసీ అప్‌డేషన్ పూర్తయిందని, అయితే పరీక్షించుకోవాల్సి ఉందని, మీ బ్యాంక్ ఖాతా నుంచి చిన్న మొత్తాన్ని వాలెట్‌లోకి బదిలీ చేసుకోవాలని సూచిస్తున్నారు. వినియోగదారుడు తన స్మార్ట్‌ఫోన్ ద్వారా ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు అతడు టైప్ చేస్తున్న యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సహా అన్ని వివరాలు సైబర్ నేరగాడు చూస్తూ నమోదు చేసుకుంటాడు. ఆపై వీటిని వినియోగించి లావాదేవీలు చేస్తూ బాధితు డి ఖాతాలోని డబ్బును తమ ఖాతాలు/వాలెట్స్‌లోకి మళ్లిస్తాడు. ఈ లావాదేవీలకు సంబంధించిన వన్ టైమ్ పాస్‌వర్డ్స్ (ఓటీపీ) వినియోగదారుడి సెల్ నెంబర్‌కే వస్తాయి. అయితే అతడి ఫోన్‌లో ఉన్న యాప్ సహా యంతో వీటిని సైబర్ నేరగాడు చూడగలుగుతాడు.
నిమిషాల్లో ఖాళీ చేస్తారు
ఇలాంటి నేరాల్లో సైబర్ నేరగాళ్లు నిమిషాల్లో ఖాతాలోకి డబ్బును వారి వాలెట్స్‌లోకి మళ్లిచుకుంటున్నారు. మోసపోతున్నాం అని గుర్తించే లోపే నష్టపోవాల్సి వస్తోంది. బ్యాంకు ఖాతాదారులు, యాప్స్ వినియోగదారుల డేటా వారికి ఎలా చిక్కుతోందనే విషయాన్ని పోలీసులు గుర్తించాలి. ఆ మార్గాలు కట్టడి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే ఇలాంటి నేరాలు తగ్గుతాయి. నేను ఈ కేవైసీ క్రైమ్‌లో బాధితుడిగా మారి రూ.20 వేలు పోగొట్టుకున్నాను. చిన్న చిన్న మొత్తాలు పోగొట్టుకుని బాధితులుగా మారిన అనేక మంది వివిధ కారణాల నేపథ్యంలో ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదు. ఇలాంటి వ్యవహారాలను పోలీసులు సీరియస్‌గా తీసుకుని నిరోధక మార్గాలు అన్వేషించాలి. – యాదగిరి, మౌలాలీ
అప్రమత్తతే పరిష్కారం
కంటికి కనిపించకుండా ఆన్‌లైన్‌లోనే అందినకాడికి దోచుకునే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ పంథా మార్చుకుంటున్నారు. ఓ తరహా నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల్లోకి చేరే సరికి మరో తరహాలో మోసాలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి నేరగాళ్లకు చెక్ పెట్టగలం. వీరు వినియోగించే సెల్‌ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, వాలెట్స్ బోగస్ పేర్లు, వివరాలతో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి కేసుల్లో బాధ్యులను పట్టుకోవడం కష్టసాధ్యంగా మారింది. ప్రతి ఒక్కరూ అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు చేయరాదు. కేవైసీ, లింకేజ్, అప్‌డేషన్ తదితరాలను నేరుగా ఆయా బ్యాంకులకు లేదా వాలెట్ అధీకృత వ్యక్తుల వద్దకు వెళ్లి చేసుకోవాలి. ఫోన్ కాల్స్‌ను నమ్మి ఎలాంటి లింకులు క్లిక్ చేయకూడదు. ఇవి ఒక్కోసారి విపరీత పరిణామాలకు కారణమవుతాయి. – సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment