
డీడీ గ్యాంగ్ నేరాల వివరాలు వెల్లడిస్తున్న ఏడీసీపీ షేక్ నవాబ్ జాన్
విజయవాడ : డీడీ (డేరింగ్ అండ్ డేషింగ్) గ్యాంగ్ పేరుతో ఓ ముఠాగా ఏర్పడి గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కేసులో ఐదుగురిని భవానీపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 650 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో అడిషినల్ డెప్యూటీ కమిషనర్ షేక్ నవాబ్ జాన్ వివరాలను వెల్లడించారు. విజయవాడ భవానీపురం ప్రియదర్శిని కాలనీకి చెందిన గుంటూరు ప్రవీణ్ కుమార్ అలియాస్ ప్రవీణ్ (27), ముత్యం నాగరాజు (21), పెద్దిశెట్టి సాయిదుర్గాప్రసాద్ (21), పెద్ది శివరామకృష్ణ (21), మేడిశెట్టి విజయబాబు (21) లను అరెస్టు చేశారు. నిందితులపై గతంలో కొట్లాటలు, దొంగతనాల కేసులు ఉన్నాయి.
వీరు మరో ఐదుగురు పాత నేరస్తులతో కలిసి భవానీపురం ఏరియాలో కొందరిని బెదిరించి డబ్బు దోచుకున్నారు. కొందరు యువకులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఎరవేసి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అయితే వారికి భయపడి బాధితులు ఫిర్యాదు చేయటానికి ముందుకు రావటం లేదు. ఈ క్రమంలో పోలీసులు నిందితులపై నిఘా పెట్టి వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ఐదుగురు పాత నేరస్తులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడు జూపూడి వంశీ రాంబాబు, నవీన్ రెడ్డి, ఎండీ అలీ రాజమండ్రి సెంట్రల్ జైలులో వేరే కేసుల్లో రిమాండ్‌లో ఉండగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తేలింది. ఇటువంటి తరహా కేసులపై ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఏడీసీపీ షేక్ నవాజ్ జాన్ కోరారు. విలేకరుల సమావేశంలో వెస్ట్ ఏసీపీ గున్నం రామకృష్ణ, భవానీపురం సీఐ వైబీ రాజాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment