ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, నేరాలు మరింత తీవ్రం కావడం ఆందోళన పుట్టిస్తోంది. ముఖ్యంగా బాలికలు, యువతులపై అత్యాచారాల సంఘటనల్లో బాధితులకు తెలిసినవారు, సమీప బంధువులే ఎక్కువగా లైంగికంగా హింసిస్తున్నారనేది ఒక చేదు నిజం. తాజాగా హైదరాబాదులో ఇలాంటిదే మరో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల అమ్మాయి లైంగికంగా దాడిచేశాడో సవతి తండ్రి. అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తీవ్రంగా హింసించాడు. చివరకు ధైర్యం చేసి తల్లి సాయంతో పోలీసులను ఆశ్రయించింది బాధిత బాలిక.
వివరాల్లోకి వెళితే ఎనిమిది సంవత్సరాల క్రితం వితంతు మహిళను వివాహం చేసుకున్నాడు నిందితుడు. ఈమెకు మొదటి భర్తతో సృజన( పేరు మార్చాం) అనే కూతురు ఉంది. భార్య ఇంట్లోలేని సమయంలో సవతి కూతురుపై లైంగిక దాడి చేయడంతోపాటు తల్లితో చెప్పవద్దని బెదిరించాడు. భయంతో బాధితురాలు మౌనం వహించింది. కానీ సంఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత, ఆమె తల్లి పని కోసం బయలుదేరబోతుండగా భయంతో వణికి పోయింది. తనను విడిచి వెళ్లొద్దంటూ భోరున విలపించింది. కూతురు ద్వారా విషయం తెలుసుకున్న మహిళ భర్తను నిలదీసింది. అయితే.. ముందు బుకాయించినా, గట్టిగా నిలేయడంతో మద్యం మత్తులో తప్పు చేశాననీ, క్షమించమంటూ కాళ్లా వేళ్లా పడ్డాడు. దీంతో తల్లీ కూతుళ్లిద్దరూ ఆ కామంధుడిని క్షమించేశారు.
కానీ నెల రోజుల తరువాత మళ్లీ లైంగిక దాడికి తెగబడ్డాడు. తప్పించుకుని బాత్ రూంలోకి పారిపోయి తలుపు వేసుకుంది. తలుపు పగల గొట్టి మరీ ఆమెపై దాడిచేశాడు. బెల్ట్‌తో చితకబాదాడు. భర్త క్రూరత్వం గురించి తెలిసిన ఆమె కూతురి స్థితిని గమనించి విషయాన్ని అర్థం చేసుకుంది. నేరుగా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఇంకో విషయం ఏమిటంటే కేసు నమోదు చేయడానికి వారు మూడు పోలీస్‌స్టేషన్లు తిరగాల్సి రావడం.. సంఘటన తరువాత పారిపోయిన నిందితుడు, మళ్లీ రాజీకోసం ప్రయత్నించాడు. కేసు ఉపసంహరించుకోవాలని, అమ్మాయి పేరుతో డబ్బులు డిపాజిట్ చేస్తానని, చదువుకు సాయం చేస్తానంటూ బేరసారాలు మొదలు పెట్టాడు. ఎట్టకేలకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వద్దు డాడీ.. మొత్తుకున్నా.. ఆ కామాంధుడు కనికరించలేదని, తాను గట్టిగా ఏడుస్తూ కేకలు పెట్టినా.. చుట్టుపక్కల వారు ఎవరూ ముందుకురాలేదని బాధితురాలు వాపోయింది. అసలు ఆయన తన తండ్రి కాదనే విషయం ఎవరికీ తెలియదనీ, చివరికి తన తమ్ముడికి కూడా తెలియదని చెప్పింది. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటికి వెళ్లనని స్పష్టం చేసింది. ఇంట్లో తనకు రక్షణలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అందుకే తాను హాస్టల్లో ఉండి చదువుకుని పోలీసు ఉద్యోగం సాధిస్తానని చెప్పింది. ఇంటా, బయట ఆడబిడ్డలపై జరిగే అఘాయిత్యాలపై మొదటినుంచీ తన తల్లి హెచ్చరిస్తూ వుండేదని బాధిత బాలిక చెప్పింది. అదే తనకు ఈ ధైర్యాన్నిచ్చిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment