
తాడ్వాయి(ఎల్లారెడ్డి): సైకోగా మారిన ఓ తండ్రి కన్న కూతురునే దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్ గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన గడ్డం చిన్న బాలరాజు, సాయవ్వలకు ఇద్దరు కూతుళ్లు శ్రీజ(16), రమ్య, కుమారుడు రణదీప్ ఉన్నారు. శ్రీజ ఎండ్రియాల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చిన్న బాలరాజు ఎర్రాపహాడ్‌లో భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయంతోపాటు కూలి పనులు చేస్తున్నాడు. శ్రీజ ఎర్రాపహాడ్‌లోని అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటూ రోజూ ఎండ్రియాల్‌కు వచ్చి వెళ్లేది.
దీపావళి సెలవులు కావడంతో మంగళవారం ఎండ్రియాల్‌కు వచ్చింది. ఆమె తల్లి సాయవ్వ పుట్టింటికి వెళ్లింది.ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో తండ్రి, కూతురు మాత్రమే ఉన్నారు. రాత్రి వేళలో చిన్న బాలరాజు గొడ్డలితో కూతురు మెడపై నరికి చంపాడు. సాయవ్వ బుధవారం ఉదయం తిరిగి వచ్చేసరికి శ్రీజ రక్తపు మడుగులో ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు చిన్న బాలరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు కారణాలు తెలియరాలేదు. కాగా, శ్రీజ 7, 8, 9 తరగతుల్లో చక్కటి ప్రతిభ చూపడంతో ఎస్‌బీఐ ఎర్రాపహాడ్ శాఖ ఏటా రూ. 5 వేల స్కాలర్‌షిప్ అందిస్తోంది. నిందితుడు చిన్న బాలరాజు ఎవరితో సరిగా మాట్లాడడని, సైకోగా వ్యవహరించేవాడని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment