
పీటలపై పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపం చెంది తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన
కృష్ణరాజపురం : కూతురు ప్రేమలో మోసపోవడం, పీటలపై పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపం చెంది తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. సంజయ్‌గాంధీ నగర్‌కు చెందిన ఉదయ్ అదే ప్రాంతానికి చెందిన యువతి కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అప్పటికే వివాహమైన ఉదయ్ తనకు వివాహమైన విషయాన్ని దాచిపెట్టి ప్రేమ నాటకాన్ని కొనసాగించాడు. ఇరువురి ప్రేమ విషయం తెలుసుకున్న యువతి తండ్రి గతనెల 30వ తేదీన వారి వివాహానికి ముహూర్తం నిర్ణయించి పెళ్లి ఏర్పాట్లు చేశాడు.
మహూర్తానికి సమయం మించిపోతున్నా ఉదయ్ రాకపోవడంతో గాలింపు చేపట్టగా హఠాత్తుగా ఆ యువతి ఇంటివద్ద ప్రత్యక్షమైన ఉదయ్ భార్య విషయం మొత్తం బయటపెట్టింది. కూతురు ప్రేమలో మోసపోవడం, పీటలపై పెళ్లి ఆగిపోవడాన్ని తట్టుకోలేక ఆ యువతి తండ్రి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందిని లేఅవుట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.