వరంగల్ : ఓరుగల్లులో మూడు ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మూడు సంఘటనల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఆరుగురు బలవర్మరణాలకు పాల్పడగా.. రోడ్డు ప్రమాదం మరో ఇద్దరిని మింగింది.
బావా, మరదళ్ల ఆత్మహత్య
రామారంలో బావ, మరదళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కాకతీయ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ్ రెడ్డి నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడగా, ఆయన మరదలు రక్షితరెడ్డి ఉరేసుకుని ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్నారు. వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ప్రవీణ్ రెడ్డి స్వస్థలం రాయికల్ కాగా.. రక్షిత రెడ్డిది జగన్నాథపురం.
రైలు కింద పడి నలుగురు..
ఖిల్లా వరంగల్ మండలం చింతల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఒకే రోజు నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. వీరు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే మరొక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి వివరాలు తెలియాల్సి ఉంది.
రైల్వే ట్రాక్‌పై తలలు పెట్టడంతో ముగ్గురి తలలు మొండెం నుంచి వేరయ్యాయి. అక్కడ భయంకర వాతావరణం నెలకొంది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి జేబులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతని పేరు కొంగ మహేశ్‌గా గుర్తించారు. చనిపోయింది కొంగ మహేశ్(35), ఆయన తల్లి పూలమ్మ(55), కుమార్తె దర్శిని(10)గా గుర్తించారు.
కొంగ మహేశ్ స్వస్థలం నల్గొండ జిల్లా కోదాడ. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య పేరు సంగీత. కుటుంబంతో కలిసి నిన్ననే హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వచ్చారు. ఆయన భార్య సంగీత.. ఖాజీపేటలో ఉంటున్న చెల్లిలి వద్దకు నిన్న వెళ్లింది. వీరంతా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి అదృశ్యమయ్యారు.
మహేశ్ తను చనిపోయే ముందు స్నేహితులకు, బంధువులకు ‘ఐ మిస్ యూ ఆల్’ అని మెసేజ్ పెట్టారు. దీంతో బంధువులు, స్నేహితులు మహేశ్ కోసం వెతకడం ప్రారంభించారు. ఈ రోజు ఉదయం రైలు పట్టాలపై మృతదేహాలై కనిపించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. భార్య సంగీతను రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే వీరంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు
పర్వతగిరి మండలం గుంటూరుపల్లి వద్ద గురువారం వేకువజామున ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన కాయక సంపత్(29), పల్లె ప్రభాకర్(19) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వరంగల్ నుంచి స్వగ్రామము వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment