
సాక్షి, కొమురవెల్లి: నేడు తల్లిదండ్రులు పిల్లలని ఏమాత్రం అనలేని పరిస్థితి. చిన్న మాట అన్నాకూడా ఆత్మహత్యలకు పాల్పడి నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా తల్లిదండ్రులు మందలించారని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో జరిగింది. జనాదికుంట కుమార్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
రెండో కుమారుడు ప్రవీణ్(19) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. గత నాలుగైదు రోజులుగా కాలేజీకి వెళ్లకుండా ఇంటి దగ్గర చిల్లర తిరుగుళ్లు తిరుగుతుండడంతో వ్యవసాయ బావి వద్దకు పోయి పనిచేయొచ్చు కదా అంటూ తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రవీణ్ బావి వద్దకు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రలు మందలించడమే తమ తప్పయిందంటూ రోదించారు.