
ప్రతీకాత్మక చిత్రం
ఆగమేఘాలమీద మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంతిమ సంస్కరాలకు ఏర్పాట్లు చేశారు. మరికొద్ది క్షణాల్లో శవాన్న దహనం చేస్తారనగా పోలీసులు రంగప్రవేశం చేశారు.
న్యూఢిల్లీ : కూతురు ప్రేమ వ్యవహారం నచ్చకపోవడంతో ఓ కుటుంబం కన్నెర్రజేసింది. దారుణంగా గొంతు నులిపి హత్య చేసి ఆత్మహత్యగా అందర్నీ నమ్మించాలనుకుంది. కానీ, పోలీసుల రాకతో సీన్ మారింది. వివరాలు.. ఉత్తర ఢిల్లీలోని ఆజాద్‌పూర్ ఆదర్శనగర్‌లో రెండు నెలల క్రితం శీతల్ అనే బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అయితే, వారు మృతురాలి ఇంటికి చేరుకునేలోపే శవాన్ని మాయం చేశారు. ఆగమేఘాలమీద మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంతిమ సంస్కరాలకు ఏర్పాట్లు చేశారు. మరికొద్ది క్షణాల్లో శవాన్ని దహనం చేస్తారనగా పోలీసులు రంగప్రవేశం చేశారు.
ఆఘమేఘాలమీద శవ దహనానికి ఏర్పాట్లు చేయడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. ఆ నివేదికలో అసలు విషయం బయటపడింది. దారుణంగా హింసించి, గొంతు నులమడంతో శీతల్ మరణించిందనే నిజం తెలిసింది. శీతల్ తండ్రి లఖన్ (50), ఇంటిపక్కనే ఉండే రాజు (30) ఇద్దరూ చేసిన నేరాన్ని ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. శీతల్ ఓ యువకుడిని ప్రేమించడంతోనే తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. గత జూలై 24న శీతల్ హత్య జరగగా అసలు నిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.