
గుర్తుతెలియని వ్యక్తి చేతిలో హతుడైన అంకిత్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : తన సోదరితో సన్నిహితంగా ఉంటున్నాడనే కసితో కోచింగ్ సెంటర్ నిర్వహించే వ్యక్తిని హతమార్చిన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని జహంగరిపురి ప్రాంతంలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న అంకిత్ (31) సోమవారం క్లాస్ తీసుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొచ్చుకువచ్చి అతడిని కాల్చి చంపారు. ఓ మహిళతో సంబంధం నెరుపుతున్నందునే అంకిత్ హత్య జరిగిందని భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఇద్దరు విద్యార్ధులు క్లాస్‌రూమ్‌లో ఉన్నట్టు సమాచారం.
అంకిత్‌కు ఓ మహిళతో సంబంధం ఉందని దీనిపై ఇరు కుటుంబాలకూ ఎలాంటి అభ్యంతరం లేదని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం మహిళ సోదరుడికి ఇష్టం లేదని తెలిసింది. అంకిత్ హత్య వెనుక అతని ప్రియురాలి సోదరుడి హస్తం ఉందని అంకిత్ సోదరి ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యోదంతంలో వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు నేరం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment