‘బ్యాంక్‌ వివరాలు కావాలి.. మీ అకౌంట్‌లో డబ్బులేస్తాం’ | Delhi Model Cheats 15 Others By Promise International Fashion Events | Sakshi
Sakshi News home page

‘బ్యాంక్‌ వివరాలు కావాలి.. మీ అకౌంట్‌లో డబ్బులేస్తాం’

Published Fri, Aug 10 2018 4:39 PM | Last Updated on Fri, Aug 10 2018 4:43 PM

Delhi Model Cheats 15 Others By Promise International Fashion Events - Sakshi

న్యూఢిల్లీ : మోడలింగ్‌ రంగంలో వెలిగిపోవాలని భావించాడు. కానీ అక్కడ అవకాశాలు రాకపోవడం, ఆర్ధిక పరిస్థితులు కూడా దెబ్బతినడంతో కొత్త అవతారం ఎత్తాడు. ఈ రంగంలోకి వచ్చిన వారిని బుట్టలో వేసుకోవడం ఎలానో తెలుసుకున్నాడు. అనంతరం తానే ఓ మోడలింగ్‌ ఏజెన్సీని ప్రారంభించాడు. అంతర్జాతీయ మోడలింగ్‌ కంపెనీలలో అవకాశమిస్తానంటూ నమ్మబలకి 15 మంది యువతుల దగ్గర నుంచి దాదాపు 25 లక్షల రూపాయల వరకూ కాజేశాడు. చివరికి ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు.

వివరాల ప్రకారం.. శుభమ్‌ అలియాస్‌ విరాజ్‌ రాయ్‌ అనే ఢిల్లీకి చెందిన వ్యక్తి మోడల్‌ కావాలని ఆశించాడు. కానీ సరైన అవకాశాలు రాలేదు. ఈ లోపు ఆర్థిక పరిస్థితులు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఇబ్బందులు నుంచి బయటపడటం కోసం ‘డ్రీమ్‌ ఫర్‌ సక్సెస్‌’ అనే నకిలీ మోడలింగ్‌ ఏజెన్సీని ప్రారంభించాడు. మోడలింగ్‌ మీద ఆసక్తి ఉండి, ఆన్‌లైన్‌లో తమ ప్రొఫైల్‌ను అప్‌లోడ్‌ చేసే యువతుల వివరాలను సేకరించేవాడు. అనంతరం వారికి తన ఫోన్‌ నెంబర్‌ను, నకిలీ మోడలింగ్‌ కంపెనీ వివరాలను మెసేజ్‌ చేసేవాడు. అతనిని నమ్మి అవకాశాల కోసం వచ్చే యువతులతో తనకు అంతర్జాతీయ మోడలింగ్‌ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని.. అంతేకాక సిని పరిశ్రమలో కూడా చాలా మంది తనకు తెలుసంటూ నమ్మబలికాడేవాడు.

సదరు యువతులు తన మాటలను నమ్ముతున్నారని నిర్ధారించుకున్న తర్వాత వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం కోసం తెలివిగా షో అయిపోయిన తర్వాత  సదరు అంతర్జాతీయ కంపెనీ వాళ్లు మీకు డబ్బులు పంపించడం కోసం మీ బ్యాంక్‌ వివరాలు, కార్డ్‌ నంబర్‌, దానిపై ఉండే సీవీవీ నంబర్‌ చెప్పండని అడిగేవాడు. అలా వివరాలు పంపించిన యువతలకు ఫోన్‌ చేసి సదరు అంతర్జాతీయ కంపెనీ వారు మీ ఫోటోలు కావాలంటున్నారు అని చెప్పేవాడు. అతని మాటలు నమ్మి వచ్చిన యువతులను వారి మొబైల్‌ ఫోన్‌, ఇతర వస్తువులను తన దగ్గర వదిలి, ఫోటోషూట్‌ కోసం వెళ్లేలా వారిని ఒప్పించేవాడు. సదరు యువతులు ఫోటోలు దిగడం కోసం వెళ్లిన వెంటనే విరాజ్‌ వారి మొబైల్‌ ఫోన్‌ ద్వారా వేరే వేరే అకౌంట్‌లకి డబ్బులను పంపించుకునేవాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మోసాల్లో విరాజ్‌ భార్యకు కూడా భాగం ఉంది. ఈ జంట ఇప్పటికే ఇలా ఓ 15 మంది యువతుల దగ్గర నుంచి దాదాపు 25 లక్షల రూపాయలు వసూలు చేశారు. మోసపోయిన వారిలో ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విరాజ్‌ను అతని భార్యను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement