
అరెస్టయిన డాక్టర్ సోదరుడు, ఇద్దరు కారు డీలర్లు
అన్నయ్య డాక్టర్ హరేష్ సాయంతో 2014 నుంచి ఇప్పటివరకు 251 కార్లను ..
అహ్మదాబాద్/గుజరాత్: పగటి సమయంలో ప్రాణాలు పోయడం ఆయన వృత్తి.. రాత్రయితే చోర కళను చేపట్టడం ప్రవృత్తి. పైకి పెద్ద మనిషిలా నటిస్తూ.. పార్క్ చేసిన కారు లాక్‌ను సులువుగా తీసేస్తాడు. ఎవరికీ అనుమానం రాకుండా దర్జాగా నడుపుకుంటూ వెళ్తాడు. అలా ఇప్పటివరకు ఎన్నో కార్లను దొంగిలించాడో డాక్టర్. ఈయన బాగోతం ఇటీవల వెలుగుచూసింది.
తనిఖీల్లో పట్టుబడ్డ అరవింద్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. తన అన్నయ్య డాక్టర్ హరేష్ సాయంతో 2014 నుంచి ఇప్పటివరకు 251 కార్లను దొంగిలించినట్టు నేరం ఒపుకున్నాడని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. ఘటనతో ప్రమేయమున్న ఇద్దరు కారు డీలర్లను అరెస్టు చేశామనీ, డాక్టర్ హరేష్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. హరేష్ కోసం గాలిస్తున్నామన్నారు.
గ్రామాల మీదుగ ప్రయాణం..
మరిన్ని వివరాలు.. అహ్మదాబాద్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న హరేష్ మానియా తన తమ్ముడు అరవింద్ సాయంతో కార్ల దొంగతనాలు చేశాడు. రాత్రి కాగానే ఎస్‌జీ రోడ్డులో పార్క్ చేసి ఉన్న కార్లను దొంగిలించి తన తమ్ముడు అరవింద్‌కు అప్పగిస్తాడు. ఓ రెండు రోజుల అనంతం ఆ కార్లను అరవింద్ పోలీసులు, టోల్ ప్లాజాల కంటబడకుండా మారుమూల గ్రామాల మీదుగా వాటిని రాజ్‌కోట్‌కు చేరుస్తాడు. డీలర్లు వోరా, సలీం షైక్ కార్ల రూపు రేఖలను పూర్తిగా మార్చేసి అమ్మేస్తారు. ఇలా ఒక్కొక్క కారుపై 30 నుంచి 40 వేలు సొమ్ము చేసుకుంటున్నారీ డాక్టర్, అతని తమ్ముడు అని క్రైం బ్రాంచ్ ఎస్సై జేఎన్ చావ్‌డా వెల్లడించారు.