రాజీవ్‌రహదారిపైరాస్తారోకో చేస్తున్న బంధువులు లింగంపల్లి విజయ(ఫైల్)
కోల్‌సిటీ(రామగుండం): సర్కారు ఆస్పత్రిపై నమ్మకంతో ప్రసవం కోసం వెళ్తే... వైద్యుల నిర్లక్ష్యంతో లేబర్ రూం(ప్రసూతీ కేంద్రం)లోని టేబుల్‌పైనే, గర్భిణీ లింగంపల్లి విజయ(30), కడుపులోని బిడ్డ ప్రాణాలు విడిచారు. డాక్టర్లకు బదులు సిబ్బంది ప్రసవం చేస్తున్న సమయంలో బిడ్డ బయటకు వచ్చిందని చెప్పినప్పటికీ మూడు గంటలపాటు వైద్యులు రాకుండా నిర్లక్ష్యం వహించి నిండుచూలాలును పొట్టనపెట్టుకున్నారు. దీంతో మృతురా లి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు..
నార్మల్ డెలివరీ కోసం అడ్మిట్...
గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన రేణికుంట సుగుణ, రాజయ్యల కూతురు లింగంపల్లి విజయ(30)కు కరీంనగర్ జిల్లాలోని చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన రేణికుంట శ్రీనివాస్‌తో వివా హం జరిపించారు. ప్రస్తుతం మహారాష్ట్రంలోని నాగపూర్ ప్రాంతంలో శ్రీనివాస్ పని చేస్తున్నాడు. వీరికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. విజయ రెండోసారి గర్భం దాల్చింది. గత నెల రాఖీపౌర్ణమికి గోదావరిఖనిలోని పుట్టింటికి వచ్చింది. ఈనెల 9న డెలివ రీ చెయ్యాల్సి ఉంది. పురుటి నొప్పులు రాకపోవడంతో 12న గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. మొదటి కాన్పు సాధారణ ప్రసవం జరిగిందని, ఇప్పుడూ నార్మల్ డెలివరీ చేస్తామని పరీక్షించిన వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు.
సకాలంలో స్పందించని వైద్యులు...
శుక్రవారం ప్రసూతి కేంద్రంలోని డెలివరీ టేబుల్‌పై విజయను పడుకోబెట్టారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండానే నర్సింగ్ సిబ్బంది, శిక్షణ పొందడానికి వచ్చిన స్టూడెంట్స్‌తో సాధారణ ప్రసవానికి సిద్ధమయ్యారు. పురిటినొప్పులు రావడానికి ఇంజక్షన్లు ఇచ్చారు. కాసేటికి శిశువు తల బయటకు కనిపించడంతో, విజయతో ఉన్న మహిళ వెంటనే సిబ్బందికి చెప్పింది. డాక్టర్లతో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రయత్నించిన సిబ్బంది ఇంజక్షన్ వేశారు. విజయ అపస్మారకస్థితిలో ఉండడంతో డాక్టర్లను పిలుచుకొస్తామని చెప్పిన సిబ్బంది మూడుగంటలపాటు పత్తాలేకుండా పోయారు. తర్వాత హడావుడిగా వచ్చిన డాక్టర్లు, విజయను పరీక్షించి వెంటనే వెళ్లిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునేలోగా పోలీసులు వచ్చారు. ఏం జరిగిందని నిలదీస్తే విజయ చనిపోయిందని చెప్పారు. ఆస్పత్రిలో సమాధానం చెప్పడానికి ఒక్క డాక్టర్ కూడా లేకుండా మాయమయ్యారు. మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తుండగా, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని మార్చురీలో భద్రపరిచారు.
రాజీవ్ రహదారిపై రాస్తారోకో...
విజయ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు ప్రధానరహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసుల జోక్యంతో విరమించి, ఆస్పత్రి ఆవరణలోని మెడికల్ సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. వీరికి శాప్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అండగా నిలిచారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతామని సీఐ వాసుదేవరావు హామీ ఇవ్వడంతో ఆందోళన వివరమించారు. అనంతరం బంధువుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment