
సాక్షి, పరకాల(వరంగల్) : ఒకే కుక్క 33మందిని తీవ్రంగా గాయపరిచి భయాందోళనకు గురిచేసిన సంఘటన వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంచలనం రేపింది. పరకాల, నడికూడ మండలంలో గత కొద్ది రోజులుగా పిచ్చికుక్కల దాడులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఓ పిచ్చికుక్క వరికోల్ గ్రామస్తులను వనికించింది. 33 మందికి తీవ్రంగా గాయపరిచి వారి రక్తం కళ్లచూసింది. ఈ దాడిలో 15 మంది వృద్ధులు, ముగ్గురు బాలికలు ఉండగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులంతా పొలం పనులకు వెళ్లిన సమయంలో గ్రామ శివారు నుంచి వచ్చిన పిచ్చి కుక్క కనబడిన వృద్ధులు, చిన్నారులపై దాడి చేసింది.
అంతేకాకుండా గ్రామంలోని ఇతర కుక్కలు, పశువులుపై సైతం దాడిచేసి గాయపరిచింది. దాడిలో గాయపడిన వారిలో 17 మందిని వెంటనే పరకాల సివిల్ ఆస్పత్రికి, మిగతా వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి, మరికొందరిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. పరకాల సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పోచంపల్లి వెంకటనర్సమ్మ, రాచమల్ల చేరాలు, పోచంపల్లి చిన్నమల్లారెడ్డి, దిడ్డి కొమ్మాలు, రామంచ స్వర్ణలత, దాట్ల సరోజన, వంగ రామయ్య, పోశాలు సరోజన, శంకర్‌రావు, కుసుమ సాంబశివరావు, చెనుమల్ల శంకరమ్మ, లడె సునిత, గుండెకారి లచ్చమ్మ, బల్గు రవిందర్, గుండెకారి శంకరమ్మ, చిన్నారులు పర్శ గౌతమి, పకిడె అమ్ములు, దొగ్గె విక్టోరియాలు ఉన్నారు. వీరందరికీ ప్రథమ చికిత్స చేసి తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎంకు సిఫారసు చేశారు.
రెండు కుక్కలు హతం
పచ్చి కుక్క దాడి చేయడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. తమ వారిని కుక్క కరించిందని తెలియగానే పొలం పనులు వదిలి గ్రామంలోకి చేరుకున్నారు. గాయపడిన వారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రులకు తరలించగా, గ్రామస్తులతో దాడిచేసిన పిచ్చి కుక్క కోసం గాలించారు. అనుమానంగా ఉన్న రెండు కుక్కలను హతమార్చారు.
Comments
Please login to add a commentAdd a comment