నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బులు, ఆధార్ కార్డు జిరాక్స్‌లు చూపిస్తున్న సీపీ సజ్జనార్
రాయదుర్గం: చదివింది ఎంబీఏ, ఎంఏ డిగ్రీలు....కానీ చేసింది మాత్రం అమాయక పేద, మధ్యతరగతి ప్రజల్ని మోసం. సర్వే ఆఫ్ ఇండియాలో రీజనల్ మేనేజర్‌నని, తమ ద్వారానే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని నమ్మబలికి పేద, మధ్య తరగతి ప్రజల్ని నిట్టనిలువునా మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి కటకటాలకు పంపించారు. అతని నుంచి రూ. 8.55 లక్షలు, సెల్‌ఫోన్, బైక్,, సెక్యూరిటీ మేనేజర్ ఆపరేషన్స్ లిటనెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐడీకార్డ్, 47 మంది ఆధార్‌కార్డుల జిరాక్స్‌కాపీలు, మరో 50 మంది నుంచి ఆధార్‌కార్డు జిరాక్స్‌లు, పాస్‌పోర్టుసైజ్‌ఫొటోలు, 27 మంది నుంచి తీసుకున్న సెల్ప్ బాండ్ ఖాళీ పేపర్లను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో కమిషనర్ వీసీ సజ్జనార్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం..
మొదట్లో సెక్యూరిటీ సూపర్‌వైజర్...
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దువ్వురు గ్రామానికి చెందిన కూనంరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి (47) నగరానికి వలస వచ్చారు. నెల్లూరులోని బెంగళూరు వర్సిటీలో ఎంబీఏ దూరవిద్యా విధానం ద్వారా పూర్తి చేశాడు. అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంఏ (ఎకనామిక్స్) కూడా పూర్తి చేశారు. అనంతరం 2016లో మాదాపూర్‌లోని లిటనెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహించేవాడు. ఆతర్వాత 2018 మే మాసంలో ఈ సంస్థను మూసివేశారు. ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది.
‘డబుల్’ ఇళ్ల పేరిట వసూళ్ల పర్వం...
అప్పుడప్పుడే డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం, ప్రజలు దరఖాస్తులు చేసుకోవడానికి ఆసక్తి కనబర్చడంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. అనంతరం చందానగర్, ఆర్‌సీపురం, మాదాపూర్, దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పేద, మధ్యతరతి వారిని లక్ష్యం చేసుకున్నాడు. కొంత మంది నుంచి ఖాళీ బాండ్‌పేపర్, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టుసైజ్ ఫొటోలు తీసుకోవడం ప్రారంభించాడు. ఈ దరఖాస్తుల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూళ్లు చేయడం ప్రారంభించాడు. తాను సర్వే ఆఫ్ ఇండియాలో రీజనల్ మేనేజర్‌నని తన వద్దకే దరఖాస్తులు వస్తాయని, వాటిని స్క్రూటినీ చేసిన తర్వాతే మంజూరు ఇస్తారని నమ్మబలికాడు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇతని ఆశ్రయించడం ప్రారంభించారు. ఇలా వసూళ్లు చేయడం కొందరికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో చందానగర్‌లో రెండు కేసులు, మాదాపూర్, రాంచంద్రాపురం, దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో ఒక్కో కేసు నమోదైంది. సుమారు 55 మంది నుంచి పదిలక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.
ప్రజలు మోసపోవద్దు: సీపీ సజ్జనార్
డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని ఎవరైనా అంటే నమ్మవద్దని, దళారులను ఆశ్రయించవద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రభు త్వం పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు చేస్తోందని, దరఖాస్తులను ఈసేవలో చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా ఉంటుందని, ఏదైనా సమస్యలు వస్తే ప్రజలు 100కు ఫోన్ చేయాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment