
గొడవపై ఆరా తీస్తున్న పోలీసులు
కాశీబుగ్గ : పలాసలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస చేసిన ప్రాంతంలో ఇద్దరు యువకులు ప్రహరీ లోపలికి చొరబడిన సంఘటన వివాదాస్పదమైంది. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న కొంతమంది విద్యుత్ ఉద్యోగులు పవన్‌కల్యాణ్‌కు కలవడానికి వచ్చామని, లోపలకు విడిచిపెట్టాలని గేటును కాలుతో తన్నారు.
ఈ సమయంలో పవన్ నిద్రలో ఉన్నారని అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో ఆగ్రహించిన యువకులు ఎలా పడుకుంటారో చూద్దామంటూ పరిసర ప్రాంతంలో విద్యుత్ లైన్లు కత్తిరించారు. దీంతో సరఫరాకు అంతరాయం కలిగి..చీకటిగా మారింది.
ఇద్దరు యువకులు పవన్ సిబ్బిందిపై దాడికి కూడా ప్రయత్నించారు. అందులో ఒకరిని పట్టుకోగా అతనిపేరు మోహన్‌గా గుర్తించారు. వారిని బౌన్సర్‌లు బంధించి పోలీసులకు అప్పగించారు. దీంతో విషయం తెలుసుకున్న మరికొంతమంది విద్యుత్ ఉద్యోగులు చేరుకొని ధర్నా చేశారు.
దీంతో లైన్‌మన్ రాజారావుతో పాటు పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి సీఐ కె.అశోక్‌కుమార్, కాశీబుగ్గ ఏఈ ప్రదీప్ చేరుకొని కావాలనే విద్యుత్‌ను తీసినట్టు గుర్తించారు. తగాదాలో పవన్ బౌన్సలర్‌కు తీవ్రగాయాలయ్యాయి.