సాక్షి, విశాఖపట్నం : జిల్లా ఎక్సైజ్ శాఖలో కంచే చేను మేస్తోంది. గంజాయి అక్రమ సాగు, రవాణాను నియంత్రించాల్సిన వారే అందులో మునిగి తేలుతున్నారు. దొరికిన వారే దొంగలు అన్నట్టు జిల్లాలో కొంతమంది ఎక్సైజ్ అధికారులు గంజాయి అక్రమార్కులతో పోటీ పడుతున్నారు. గంజాయి స్మగ్లర్లు తమపై ఎవరైనా అధి కారులు దాడులు చేస్తారేమోనని భయపడుతుంటారు. అందువల్ల రవాణాలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ దాడులు చేయాల్సిన వారే వారితో కుమ్మక్కై పోవడంతో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో గంజాయి సాగు, రవాణా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. జిల్లాలో కొన్నాళ్లుగా పట్టుబడుతున్న గంజాయిని ఎక్సైజ్ శాఖ య«థాతథంగా చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. బహిరంగంగా పట్టుబడ్డ గంజాయిని మాత్రమే రికార్డుల్లోకి ఎక్కిస్తున్నారన్న విమర్శలున్నాయి. మారుమూల ప్రాంతా ల్లో దొరికిన గంజాయిని లోపాయికారీగా నొక్కేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో పట్టుబడ్డ నిందితులను బెదిరించి వారి నుంచి డబ్బు వసూలు చేయడమే కాదు.. స్వాధీనం చేసుకున్న గంజాయిని కూడా తమకు అనువైన చోటికి జీపులు, వ్యాన్లు, లారీల్లో తరలిస్తున్నారు. అదే గంజాయిని స్మగ్లర్లకు రహస్యంగా విక్రయిస్తున్నారు. ఇలా జిల్లాలోని ఎక్సైజ్ శాఖలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు కొంతమంది ఉద్యోగులు వ్యాపకంగా పెట్టుకున్నారు. సాక్షాత్తూ దాడులు చేసే సిబ్బందే గంజాయిని తరలిస్తుంటే ఎవరు అడ్డుకుంటారు? దీంతో స్మగ్లర్లు నిర్భీతిగా గంజాయి రవాణాలో వేళ్లూనుకుపోతున్నారు.
అక్రమాదాయంపైనే మక్కువ
గంజాయి అక్రమ రవాణా ద్వారా వచ్చే ఆదా యం రుచి మరిగిన వారు దానిని వదులుకోలేకపోతున్నారు. జిల్లాలో గంజాయి రవాణాలో పాలుపంచుకునే వారెవరో ఉన్నతాధికారులకు తెలిసినా వారు వివిధ కారణాల వల్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్మగ్లర్లతోపాటు ఎక్సైజ్ శాఖ సిబ్బంది కూడా భారీగా అక్రమార్జన చేస్తున్నారు. అక్రమ సంపాదనతో తమ జోలికి ఎవరూ రాకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎక్సైజ్‌శాఖలో గంజాయితో లింకులున్న వారిని ఇప్పటిదాకా పోలీసు అధికారులే పట్టుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖ దాడుల్లో ఇన్నాళ్లూ స్మగ్లర్లు, కూలీలే పట్టుపడుతున్నారు తప్ప సొంత శాఖ ఉద్యోగులు దొరక్క పోవడం గమనార్హం. ముఖ్యంగా అనకాపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా విస్తృతంగా జరుగుతోంది. దీనిని అరికట్టాల్సింది పోయి ఆ పరిధిలోని కొంతమంది సిబ్బంది, అధికారులపైనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఈ పరిధిలోని పాడేరు మొబైల్ సీఐ పెదకాపు శ్రీనివాస్ ఇప్పటికే పోలీసులకు చిక్కి సస్పెండయ్యారు. ఆరు నెలలుగా ఆయన పత్తా లేకుండా పోయారు. తాజాగా అనకాపల్లి ఎక్సైజ్ టాస్క్‌ఫోర్సు కానిస్టేబుల్ నాయుడు గంజాయి విక్రయాల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి కేంద్రంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఉద్యోగులు ఉంటారు. వీరు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ గంజాయి సాగు, రవాణాలను అరికట్టేందుకు పాటుపడతారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం గంజాయి అక్రమ రవాణాలో సంబంధాలున్న ఎక్సైజ్ సిబ్బంది, అధికారుల జాబితాను ఇప్పటికే ఉన్నతాధికారులు సిద్ధం చేసినట్టు సమాచారం. త్వరలోనే వారిపై వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు విశాఖలో మకాం వేసినట్టు చెబుతున్నారు.
దర్జాగా దమ్ము.. స్మగ్లర్లకు సొమ్ము..
Published Mon, Sep 25 2017 10:35 AM | Last Updated on Thu, Jul 11 2019 8:44 PM
Advertisement
Advertisement