
బీరులో మత్తుమందు కలిపి దోపిడీ
బనశంకరి : ఫేస్‌బుక్‌లో పరిచయమైన గుర్తుతెలియని వ్యక్తి ప్రైవేటు కంపెనీ ఉద్యోగికి బీర్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి రూ.5 లక్షల విలువైన బంగారుఆభరణాలు దోచుకెళ్లాడు. బనశంకరి మూడవస్టేజ్ భువనేశ్వరినగర నివాసి రమేశ్ నగరంలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. నెలన్నరక్రితం ఫేస్‌బుక్‌లో గుర్తుతెలియని వ్యక్తి రిక్వెస్ట్ పెట్టాడు. ఈక్రమంలో వారిద్దరి మధ్య పరిచయం పెరిగి వ్యక్తిగత వివరాలు పంచుకునేవరకు వెళ్లింది. ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుబడి పెడతానని రమేష్‌ను నమ్మించాడు. ఈనెల 20న రమేశ్‌కు ఫోన్ చేసి తనకు వివాహం నిశ్చయమైందని, స్నేహితులు ఎవరూలేరని, పెళ్లి బట్టలు కొనేందుకు సహకరించాలని కోరాడు.
దీంతో రమేశ్ అతన్ని కత్రిగుప్పెలో కలిశాడు. తర్వాత బీర్, బిరియాని పార్శిల్ కట్టించుకుని ఆ వ్యక్తిని రమేష్ తన వెంట ఇంటికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. తాగునీరు తెచ్చేందుకు రమేశ్ వంటగదిలోకి వెళ్లిన సమయంలో బీర్ బాటిల్‌లో మత్తుమందు కలిపాడు. అనంతరం రమేష్‌కు బీర్ గ్లాస్ చేతికి ఇవ్వగా తాగగానే స్పృహకోల్పోయాడు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన రమేష్‌కు గుర్తుతెలియని వ్యక్తి కనబడలేదు. అనుమానంతో కప్‌బోర్డు పరిశీలించగా 20 గ్రాముల బ్రాస్‌లేట్, 28 గ్రాముల బంగారుచైన్, 60 గ్రాములు బంగారుచైన్, రెండు ఉంగరాలు, వెండివస్తువులు, సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో రమేశ్ గుర్తుతెలియని వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్చాప్ వచ్చింది. మోసపోయినట్లు గుర్తించిన రమేష్ చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రమేశ్ ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించినా గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసి వంచకుడి కోసం గాలింపు చేపట్టారు.