పోలీసుల అదుపులో నిందితుడు ,పోలీసు యూనిఫాంలో నిందితుడు రవిచంద్ర
మారేడుపల్లి : బీటెక్ చదివాడు.. అది పూర్తి చేయలేకపోయాడు.. నగరంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరాడు.. స్వగ్రామంలో ఓ యువతిని ప్రేమించాడు.. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు.. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు.. తనకు డీఎస్పీగా ఉద్యోగం వచ్చిందని ప్రియురాలికి చెప్పాడు.. యూనిఫాం వేసుకొని ఫొటోలు తీసి పంపాడు.. నిజమేనని అమ్మాయితోపాటు ఆమె తల్లిదండ్రులు నమ్మారు.. అంతేకాదు సొంత తల్లిదండ్రులను కూడా నమ్మించాడు..చివరకు విషయం బయటపడటంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి ఆదివారం మారేడ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు.. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన ఎం.వి.రవిచంద్ర (29) మూడు సంవత్సరాలుగా వెస్ట్ మారేడుపల్లిలోని సామ్రాట్‌కాలనీ రేఖా రెసిడెన్సీలో నివాసముంటున్నాడు. స్థానికంగా కాలనీవాసులకు, ఇంటి పరిసర ప్రాంతాల వారికి తాను ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్‌పీగా విధులు నిర్వహిస్తున్నానని నమ్మబలికాడు.
2012లో రిక్రూట్‌మెంట్ బ్యాచ్‌కు చెందిన వాడినని పలువురికి చెప్పుకున్నాడు. పోలీసు యూనిఫాంతో పాటు ఐడీ కార్డు, నేమ్ ప్లేటులతో ఏసీపీగా చలామణి అవుతున్నాడు. తరచుగా యూనిఫాంలో తిరుగుతూ స్థానికులను నమ్మించాడు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో రవిచంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ విషయం బయటపడింది. నిందితుడిపై 2015లో నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన కేసులో పోలీసులు ఎం.వి.రవిచంద్రను అరెస్టుచేశారు. పోలీసు అధికారిగా చెప్పుకుంటూ పలువురిని బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.గతంలో జైలుకు వెళ్ళివచ్చినా నిందితుడిలో మార్పు రాలేదు. మరొకసారి టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టుచేశారు. నిందితుడి వద్ద నుండి ఐడి కార్డు, పోలీస్ యూనిఫాం, నేమ్ ప్లేట్, మెడికల్ సర్టిఫికెట్, గ్రీన్ ఇంక్ పెన్, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీన పర్చుకున్నారు. రవిచంద్ర స్నేహితులనే తన ఉన్నతాధికారులుగా పలువురికి పరిచయం చేశాడు. రవిచంద్రవల్ల మోసపోయిన వారెవరైనా ఉంటే మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సీఐ శ్రీనివాసులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment