
మృతిచెందిన లోకేష్ భార్య, కుమారుడు. ఇన్‌సెట్లో లోకేష్
సాక్షి, నల్లగొండ : మిర్యాలగూడలోని సంతోష్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఓ కుటుంబం పురుగుల మందు సేవించి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చనపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. పారేపల్లి లోకేష్ అనే వ్యక్తి గత కొద్దికాలంగా ఉద్యోగం లేకపోవడంతో మనోవేదనకు లోనయ్యాడు. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని సేవించారు. ఈ ఘటనలో భార్య (40), కుమారుడు లోహిత్ (14) ప్రాణాలు విడువగా.. భర్త పారేపల్లి లోకేష్ పరిస్థితి విషమంగా ఉంది.
100కు డయల్ చేయడంతో..
ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లోకేష్ హైదరాబాద్‌లో ఉన్న తన సోదరికి ఫోన్ చేసి చెప్పాడు. ఆమె వెంటనే నల్లగొండలో నివాసముంటున్న మరో సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. అతను 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారమివ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో లోకేష్ భార్య, పెద్ద కుమారుడు చనిపోయి ఉన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న లోకేష్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతిని పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా సమయంలో లోకేష్‌తో పాటు చిన్న కుమారుడు రోహిత్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. తామంతా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పి సూసైడ్ నోట్ రాసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అతను మీడియాకు చెప్పాడు.
బతికే అర్హత లేదు..
ఆత్మహత్యాయత్నానికి ముందు లోకేష్ రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. ‘క్షమించండి అమ్మానాన్నా. బ్రతికే అర్హత లేదు. నాన్నా దయచేసి ఈ చిన్న అప్పులు తీర్చండి’ లోకేష్ లెటర్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. జీవితంతో స్థిరపడకపోవడంతో తన తమ్ముడు ఎప్పుడూ ఆత్మన్యూనతా భావంతో ఉండేవాడని లోకేష్ సోదరుడు చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఇంతటి ఘోరానికి పాల్పడ్డారని కన్నీరుమున్నీరయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment