
కల్పన ఫైల్ ఫోటో
ఓ వైపు తండ్రి ఆర్థిక ఇబ్బందులు మరో వైపు అత్తింటి వేధింపులు
సాక్షి, సూర్యపేట : సూర్యపేట జిల్లా తమ్మారం గ్రామానికి చెందిన కల్పనకు మూడేళ్ళ క్రితం రఘునాథపాలెంకు చెందిన వీరారెడ్డితో వివాహం జరిగింది. కల్పన తల్లిదండ్రులు కట్నంగా మూడేకరాల పొలం ఇచ్చారు. ఏడాది పాటు సాఫీగా సాగిన వీరి జీవితంలో అదనపు కట్నం చిచ్చు పెట్టింది. అదనంగా కట్నం తీసుకు రావాలంటూ కల్పనకు టార్చర్ పెట్టారు అత్తింటి వారు. విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా కొద్ది రోజులుగా కాలం వెళ్లదీస్తూ వచ్చింది కల్పన. ఏ రోజైనా వీరిలో మార్పు రాకపోదా అనుకుని ఓపిక పట్టింది. మార్పు రాకపోగా వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఓ వైపు తండ్రి ఆర్థిక ఇబ్బందులు మరో వైపు అత్తింటి వేధింపులు కల్పనను మనో వేదనకు గురి చేశాయి. దీంతో కన్న తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది కల్పన.
అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొదట సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అత్తింటి వేదింపులే తన బిడ్డ ఆత్మహత్యకు కారణమని కల్పన తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.పైగా నింధితులకే వత్తాసు పలికారని ఆవేదన వ్యక్తం చేశారు కల్పన తల్లిదండ్రులు. తర్వాత ఆత్మహత్య ముందు తాను పడిన బాధలను వివరిస్తూ కల్పన తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడంతో నెల రోజులకు పోలీసులు నిద్ర లేచారు. సెల్ఫీ వీడియో ఆధారంగా కల్పన ఆత్మహత్యకు కారకులైన భర్త వీరారెడ్డితో పాటు అత్త, ఆడపడుచులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.