
తలను సెల్‌డోర్‌కేసి గట్టిగా బాదుకున్నాడు. గట్టిగా అరుస్తూ వింతగా ప్రవర్తించాడు.
డ్రంక్ డ్రైవ్ కేసులో ట్రాఫిక్ పోలీసుల నుంచి నోటీసులు రావడంతో ఎవరెట్ పామర్(41) ఆరోజు పెన్సిల్వేనియాకు బయల్దేరాడు. కేసు క్లియర్ అయిన తర్వాత న్యూయార్క్ వెళ్లి తల్లిని చూడాలని భావించాడు. ఈ విషయాన్ని సోదరుడికి చెప్పి ఇంటి నుంచి బయటికి వచ్చాడు. అయితే అనుకున్నట్టుగా అతడు న్యూయార్క్ చేరకుండానే ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయాడు. ఈ విషయం గురించి తెలియని కుటుంబ సభ్యులు అతడి రాక కోసం నిరీక్షించసాగారు. రెండు రోజుల తర్వాత ఎవరెట్ న్యూయార్క్ కౌంటీ జైలులో మరణించాడనే వార్త విని హతాశయులయ్యారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు తెలుసుకునేందుకు అతడి కుటుంబ సభ్యులు నేటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు.
జైళ్లో వింతగా ప్రవర్తించాడు..
న్యూయార్క్ కౌంటీ జైలు అధికారులు చెప్పిన ప్రకారం...‘ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరోజు బాగానే ఉన్నాడు. మరుసటి రోజు తలను సెల్‌డోర్‌కేసి గట్టిగా బాదుకున్నాడు. గట్టిగా అరుస్తూ వింతగా ప్రవర్తించాడు. దీంతో అతడిని జైలుకు చెందిన క్లినిక్‌కు తీసుకువెళ్లాం. పరిస్థితి విషమించడంతో యార్క్ ఆస్పత్రికి తరలించాం. ఆరోజు తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో అతడు మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎవరెట్ శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అయితే ఎవరెట్ తల భాగం పూర్తిగా తెరచిఉండటం, గొంతు భాగంలో గాట్లు కనిపించడంతో అనుమానం వచ్చిన అతడి సోదరుడు..తమకు తెలిసిన పాథాలజిస్ట్‌తో ఎవరెట్ శవానికి పరీక్షలు నిర్వహించాడు. ఈ క్రమంలో ఎవరెట్ మెదడు, గొంతు, గుండె మిస్సయిన విషయాన్ని గుర్తించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఎవరెట్‌ను హత్య చేశారని అతడి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు.
ఈ విషయం గురించి ఎవరెట్ తల్లి మాట్లాడుతూ..‘ నా కొడుకుకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. తను చాలా ఫిట్‌గా ఉండేవాడు. చీమకు కూడా హాని తలపెట్టని స్వభావం తనది. పోలీసులు చెప్పినట్లు ఎవరెట్ వింతగా ప్రవర్తించే అవకాశమే లేదు. సమస్యల్లో చిక్కుకున్నపుడు ఎలా బయటపడాలో తెలిసిన ధైర్యవంతుడే గానీ. ఉద్వేగాలను అదుపు చేసుకోలేని మూర్ఖుడు కాదు. ఎవరో కావాలనే నా కొడుకును హత్య చేశారు. ఆ తర్వాత వాడి శరీరంలోని అవయవాలను దొంగిలించారు’ అని ఆరోపించారు. ఈ క్రమంలో మానవ హక్కుల కార్యకర్త, లాయర్ లీ మెరిట్ ఎవరెట్ కుటుంబానికి అండగా నిలిచారు. తన కుమారుడి మరణానికి సంబంధించిన నిజాలను తెలుసుకునేందుకు రెండేళ్లుగా ఓ తల్లి పడుతున్న ఆవేదన తీర్చేందుకు తనవంతు సహాయం చేస్తున్నారు.
ఇలాంటి మరణాలెన్నో..
గత కొన్నేళ్లుగా ఎవరెట్ తరహాలోనే ఎంతోమంది నల్లజాతీయులు అమెరికాలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కిన తర్వాత జైలుకు వెళ్లిన కొంతమంది అకస్మాత్తుగా మరణించడం, వారికి సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్టులు పెండింగ్‌లో ఉండటం జరుగుతోంది. 2015లో సాండ్రా బ్లాండ్ అనే మహిళ అనుమానాస్పద మృతితో ఇలాంటి వార్తలు వెలుగులోకి వచ్చాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిదనే కారణంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత జైలు గదిలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. అయితే అరెస్టు సమయంలో ఓ పోలీసు అధికారి.. సాండ్రాను దూషించడం, తుపాకీ గురిపెట్టి ఆమెను బెదిరించడం అక్కడి సీసీటీవీలో రికార్డు కావడంతో ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తాయి. ఈ క్రమంలో సాండ్రా కేసులో నిజానిజాలు తేల్చాలని, ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని కుటుంబ సభ్యులు, మానవహక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నా.. ఇంతవరకు ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సాండ్రా, ఎవరెట్ వంటి శ్వేతజాతీయేతర వ్యక్తులు జాత్యహంకారం కలిగి ఉన్న మూర్ఖుల చేతిలోనే బలవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.