ఎప్పుడూ వేసిన తాళం కాకుండా వేరే తాళం ఉంది.. | Farmer Counciller Vijaya Reddy Murdered in Her Apartment Visakhapatnam | Sakshi
Sakshi News home page

కిరాతకులెవరో..?

Published Wed, Feb 27 2019 7:31 AM | Last Updated on Wed, Mar 20 2019 1:32 PM

Farmer Counciller Vijaya Reddy Murdered in Her Apartment Visakhapatnam - Sakshi

కన్నీరుమున్నీరవుతున్న విజయారెడ్డి కుమార్తె, బంధువులు విజయారెడ్డి (ఫైల్‌)

సీతమ్మధార (విశాఖ ఉత్తర): బాత్‌ రూంలో రక్తపు మడుగులో మృతదేహం... చూస్తే ముఖం, తలపై తీవ్ర గాయాలు... ఎవరు చంపారో.. ఎందుకు చంపారో తెలియని వైనం... ఇదీ నగరంలో సంచలనం సృష్టించిన విజయారెడ్డి హత్యకు గురైన ఫ్లాట్‌లో కనిపించిన భయానక దృశ్యం. హత్యకు గురైన తీరు చూస్తుంటే ఎవరో కిరాతకంగా హతమార్చారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఆమె మెడలోని 20 తులాల బంగారు ఆభరణాలు కనిపించకుండాపోవడం... ఫ్లాట్‌కు తాళాలు వేసి ఉండడం... కొద్దిరోజుల కిందట నుంచి ఫ్లాట్‌ కొనుగోలు కోసం వస్తున్న వారిపైనా అనుమానాలు వ్యక్తమవుతుండడడంతో నగర పోలీసుల భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... కాంగ్రెస్‌ నగర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్‌ భోగసముద్రం విజయారెడ్డి(53) దారుణ హత్యకు గురయ్యారు. చేతులు వెనక్కు కట్టేసి తలపై సగభాగం కత్తితో నరకడం, శరీరమంతా కత్తిపోట్లు ఉండడంతో విచక్షణారహితంగా హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. అక్కయ్యపాలెం ఎన్‌జీవోఎస్‌ కాలనీ పద్మాభారతి అపార్టుమెంట్‌ ఐదో అంతస్తులోని 502వ నంబరు ఫ్లాట్‌లో భర్త విష్ణునారాయణరెడ్డితో కలిసి విజయారెడ్డి నివాసం ఉంటున్నారు. విష్ణు స్టేట్‌బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె సీతకు ఏడాది క్రితం వివాహం కాగా ఆమె హైదరాబాద్‌లో ఉంటుంది. విజయారెడ్డి ఏడాదిన్నర క్రితమే ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చారు. ప్రసుత్తం వారు ఉంటున్న ఫ్లాట్‌ను రూ.1.35కోట్లకు బేరం పెట్టింది. ఇంతలో ఈ దారుణం జరిగిపోయింది.

అంతా మిస్టరీయే
తాము ఉంటున్న ఫ్లాట్‌ను విజయారెడ్డి అమ్మకానికి పెట్టడంతో ఈ నెల 23న భీమిలికి చెందిన హేమంత్‌ అనే వ్యక్తి తన అత్త రాధికను తీసుకుని చూసేందుకు వచ్చాడు. ఫ్లాట్‌ అంతా చూసుకుని ఆదివారం అడ్వాన్స్‌ ఇస్తామని, సోమవారం డీడీ రూపంలో నగదు ఇస్తామని విజయారెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంతలో బయట నుంచి భర్త విష్ణురెడ్డి ఇంటికి రావడంతో అతనికి హేమంత్‌తోపాటు అతని అత్తను విజయారెడ్డి పరిచయం చేసింది. అనంతరం ఆదివారం రావడం కుదరడం లేదని, సోమవారం వస్తామని ఆమెకి ఫోన్‌ చేసి హేమంత్‌ చెప్పాడు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే విష్ణు నారాయణరెడ్డి ఉద్యోగానికి వెళ్లిపోయారు. అనంతరం భార్యకు ఫోన్‌ చేస్తే తీయలేదు. కుమార్తె సీత ఫోన్‌ చేసినా తీయలేదని ఆమె తండ్రికి తెలియజేసింది. ఇంతలో విష్ణురెడ్డికి హేమంత్‌ ఫోన్‌ చేసి... తాను మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మేడమ్‌ దగ్గరకు వచ్చానని, ఆమె ఫోన్‌ పనిచేయకపోవడంతో అక్కయ్యపాలెం వద్ద దింపానని... అక్కడ ఆమె ముగ్గురు వ్యక్తులతో మాట్లాడారని... ఇంతలో తన స్నేహితుడు రావడంతో వెళ్లిపోయానని చెప్పాడు. దీంతో సాయంత్రం అపార్ట్‌మెంట్‌ వద్దకు విష్ణురెడ్డి వచ్చి చూడగా సెల్లారులో కారు కనిపించలేదు.

ఫ్లాట్‌కు వెళ్లి చూడగా ఎప్పుడూ వేసిన తాళం కాకుండా వేరే తాళం వేసి ఉంది. వెంటనే వాచ్‌మెన్‌ దగ్గరకు వెళ్లి మేడం ఎక్కడకు వెళ్లారని వాకబు చేయగా తాను చూడలేందటూ సమాధానం చెప్పాడు. ఇంతలో వేరే పని మీద వెళ్లానని, ఫోన్‌ పనిచేయడం లేదు... రేపు మధ్యాహ్నం వస్తానని చెప్పి తన ఫోన్‌కు భార్య నుంచి సందేశం రావడంతో విష్ణు అనుమానంతో ఆమె స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో సోమవారం రాత్రి నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉదయం వస్తామని చెప్పడంతో మంగళవారం ఉదయం వరకు సెల్లారులో ఉండి పోలీసులు రాగానే వారి సమక్షంలో తలుపులు పగలగొట్టారు. లోనికి వెళ్లి చూడగా బెడ్‌రూంలో రక్తపుమరకలు కనిపించాయి. బాత్‌రూంలో రక్తపు మడుగులో విగతజీవిగా విజయారెడ్డి పడి ఉండడాన్ని గమనించారు. దీంతో ఒక్కసారిగా భర్త, బంధువులు బోరున విలపించారు. అప్పటికే డాగ్‌ స్క్యాడ్, క్లూస్‌ టీం సభ్యులు దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలానికి నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్రలడ్డా చేరుకొని పరిశీలించారు. అక్కడున్న సీసీ కెమెరాలు పరిశీలించారు. హత్యకు సంబంధించి భర్త విష్ణురెడ్డిని సీపీ విచారించారు. హేమంత్‌ అనే వ్యక్తి తనకి ఫోన్‌ చేసినట్లు సీపీకి విష్ణు చెప్పారు. అనంతరం సీపీ మీడియాతో మాట్లాడుతూ పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని, నిందితులను పట్టుకుంటామని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డీసీపీ రవీంద్రబాబు, డీసీపీ సురేష్‌బాబు, ఏసీపీలు, సీఐలు, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. బుధవారం పోస్టుమర్టం నిర్వహించనున్నారు.

బాత్‌ రూంలో రక్తపుమడుగులో మృతదేహం  ,ఎన్‌జీవోఎస్‌ కాలనీలో విజయారెడ్డి నివాసం ఉంటున్న అపార్టుమెంట్‌ 
పోలీసు బృందాలతో దర్యాప్తు
మాజీ కౌన్సిలర్‌ విజయారెడ్డి హత్యపై లా అండ్‌ ఆర్డర్, సీసీఎస్, టాస్క్‌ఫోర్సు, స్పెషల్‌బ్రాంచ్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. హేమంత్‌పై దృష్టి పెట్టిన పోలీసులు భీమిలి వెళ్లినట్లు తెలిసింది. అసలు హేమంత్‌ ఎవరు, ఎక్కడ ఉంటాడనే కోణంలో పరిశీలిస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ నాయకుల పరామర్శ
భోగసముద్రం విజయారెడ్డి(53) దారుణ హ త్యకు గురయ్యారని తెలుసుకున్నÐ వైఎస్సార్‌ సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, సీనియర్‌ నాయకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ జియ్యాని శ్రీధర్, కాంగ్రెస్‌ నాయకుడు మంత్రి రాజశేఖర్‌ పరామర్శించారు.

కాల్‌డేటా విశ్లేషణ  
విజయారెడ్డి, ఆమె భర్త విష్ణునారాయణరెడ్డి వాడుతున్న ఫోన్‌ల కాల్‌ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. శనివారం నుంచి మంగళవారం వరకు జరిగిన సంభాషణలపై విచారణ వేగవంతం చేశారు. అలాగే హేమంత్‌ అనే వ్యక్తి ఎవరు అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయన ఫోన్‌ మంగళవారం మధ్యాహ్నం వరకు పనిచేసింది. అనంతరం పనిచేయడం ఆగిపోయింది. అయితే కాల్‌ డేటా ప్రకారం గీతం కాలేజ్‌ వరకు హేమంత్‌ ఫోన్‌ పనిచేసిందని, తరువాత స్విచ్‌ ఆఫ్‌ వస్తోందని పోలీసులు గుర్తించారు.

విజయారెడ్డి హత్యతో దిగ్భ్రాంతి
గాజువాక: మహిళా కాంగ్రెస్‌ నగర మాజీ అధ్యక్షురాలు భోగసముద్రం విజయారెడ్డి హత్యకు గురయ్యారన్న వార్తతో గాజువాక ప్రాంతీయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందిన ఆమె గాజువాక మున్సిపాల్టీకి 1995లో జరిగిన ఎన్నికల్లో 13వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పుడు కూడా గాజువాక మున్సిపాలిటీని కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకోవడంతో విజయారెడ్డిని ఎక్స్‌ అఫీషియో సభ్యురాలిగా నియమించారు. దీంతో ఆమె పదేళ్లపాటు గాజువాక పట్టణ ప్రజలకు సేవలందించారు. ఆ తరువాత ఆమె నివాసాన్ని నగరానికి మార్చుకున్నారు. అయినప్పటికీ గాజువాక మహిళా కార్యకర్తలతో కొన్నాళ్లపాటు సంబంధాలను కొనసాగించారు. సుమారు ఆరేడేళ్ల నుంచి రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నగరంలోని అక్కయ్యపాలెంలో తన అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో హత్యకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న ఈ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, ఆమెతోపాటు కౌన్సిలర్లుగా పని చేసిన వారు హుటాహుటిన నగరానికి బయల్దేరి వెళ్లారు.

సీసీ కెమెరా ఫుటేజీ కోసం యత్నాలు
అపార్టుమెంట్‌లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నప్పటికీ ఫుటేజీ స్టోరేజీ ఉన్న మిషన్‌ పనిచేయకపోవడం పోలీసుల దర్యాప్తునకు ఇబ్బందికరంగా మారింది. దీంతో టెక్నీషియన్‌ను తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో ఫుటే జీ కోసం స్టోరేజ్‌ ఉన్న మిషన్‌ను పోలీస్‌ కమిషనరేట్‌కు పంపించారు. హత్య జరిగిన తరువాత నిందితుడు కారు తీసుకుపోయి ఉంటాడని, ఆ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తిమై ఉంటాయని భావిస్తున్నారు. హత్యకు జరిగిన తరువాత ఎవరెవరు కారులో వెళ్లారన్న సమాచారం సేకరించేందుకు యత్నిస్తున్నారు. హత్యకు కారణాలపై పోలీ సులు వాచ్‌మెన్‌ను స్టేషన్‌కు తరలించి విచా రించారు. అక్కడి పనిమనిషి నుంచి కొంత సమాచారం సేకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement