సీతమ్మధార(విశాఖ ఉత్తర): విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన మాజీ కౌన్సిలర్ భోగసముద్రం విజయారెడ్డి(54) హత్య కేసులో ఇద్దరు నిందితులను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో మంగళవారం విలేకరుల సమావేశంలో సీపీ మహేష్‌చంద్ర లడ్డా వివరాలు వెల్లడించారు. అక్కయ్యపాలెం, ఎస్‌జీవోఎస్ కాలనీలోని పద్మభారతి అపార్టుమెంట్ ఐదో అంతస్తులోని 502వ నంబర్ ఫ్లాట్‌లో భర్త భోగసముద్రం విష్ణునారాయణరెడ్డితో అతని భార్య, మాజీ కౌన్సిలర్ విజయారెడ్డి నివాసం ఉంటున్నారు. తమ ఫ్లాట్‌ను రూ.కోటి 35 లక్షలకు విజయారెడ్డి ఫిబ్రవరి 15న అమ్మకానికి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మద్దిలపాలెంలోని అలకనంద రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్న భీమిలికి చెందిన కోలా వెంకటహేమంత్‌కుమార్, ముడసర్లోవకు చెందిన రాధికలు గత నెల 23న శనివారం విజయారెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. రూ.1.35కోట్లకు బేరం కుదుర్చుకుని మరుసటి రోజు ఆదివారం అడ్వాన్స్ ఇస్తామని చెప్పారు. అయితే అప్పటికే ఆమెను హతమార్చాలని ప్రణాళిక రచించుకున్న హేమంత్ ఆదివారం అయితే విజయారెడ్డి భర్త ఉంటారని... సోమవారం వస్తానని ఫోన్‌చేసి చెప్పారు.
చెప్పినట్లుగానే 25న సోమవారం రాధిక కుమారుడు(మైనర్) విజయారెడ్డి ఇంటికి హేమంత్‌ను బైక్‌పై తీసుకొచ్చాడు. అనంతరం ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత లిఫ్ట్‌లో ఫ్లాట్‌లోకి చేరుకున్న హేమంత్ ఆస్తికి సంబంధించిన జిరాక్స్ పత్రాలు ఇవ్వాలని విజయారెడ్డిని కోరాడు. ఆమె పత్రాల కోసం బెడ్‌రూమ్‌లోకి వెళ్లగా... వెనుక నుంచి ఆమెను అనుసరించిన హేమంత్ లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో అప్పటికే తనతో తెచ్చుకున్న కత్తి, సుత్తితో తల, ముఖంతో పాటు చేతులపై విచక్షణారహితంగా నరికి తీవ్రంగా గాయపరిచి హత్య చేశాడు. ఆనంతరం మృతదేహాన్ని బాత్‌రూం వరకు ఈడ్చుకెళ్లి వదిలేశాడు. తన దుస్తులపై రక్తపు మరకలు ఉండడంతో వాటిని అక్కడే వదిలేసి, స్నానం చేసి విజయారెడ్డి భర్త విష్ణురెడ్డి దుస్తులు వేసుకుని ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం, ఒక కారు, నగదు పట్టుకొని ఫ్లాట్ తాళం వేసేసి అక్కడి నుంచి హేమంత్ పరారయ్యాడు.
అక్కడి నుంచి పారిపోయి ఆరిలోవ సమీప ముడసర్లోవ వద్ద ఉన్న నెల్లి రాధికకు బంగారం ఇచ్చాడు. అక్కడి నుంచి వారిద్దరూ కలిసి కంచరపాలెంలో గల ఆదిలక్ష్మి జ్యూయలర్స్‌లో రూ. 2.95లక్షలకు అమ్మేశారు. మధ్యలో 3 గంటలకు మరలా విజయారెడ్డి ఫ్లాట్‌కు వచ్చి వేరే తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం ఆమె భర్త విష్ణు రెడ్డి ఇంటికి చేరినప్పటికి తాళం వేసి ఉండడం... ఆయన పోలీసులను ఆశ్రయించడంతో వారు బలవంతంగా తలుపు తెరవడంతో హత్యోదంతం వెలుగు చూసింది. కేసు నమోదు చేసి భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హేమంత్‌కుమార్, రాధిక ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని నిర్ధారించారు. వారు రుషికొండ వైపు మంగళవారం కారులో వస్తుండగా అరెస్ట్ చేశారు. అయితే హేమంత్, రాధిక మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి కారు, రూ.2.75లక్షల నగదు, కత్తి, సుత్తి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో డీసీపీ రవీంద్రబాబు, ఏడీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ టేకు మోహన్‌రావు, పూర్ణచంద్రరావు, సీఐలు ఎస్.శంకరావు, ఎం.అవతారం, ఆర్.వి.ఆరకె.చౌదరి, వై.రవితో పాటు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
తప్పించుకునేందుకు మెసేజ్‌లు
మాజీ కౌన్సిలర్ భోగసముద్రం విజయారెడ్డిని హేమంత్ పక్కాగా హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య చేసిన తర్వాత ఆమె ఫోన్‌తోనే భర్త భోగసముద్రం విష్ణునారాయణరెడ్డికి పలుమార్లు మెసేజ్ చేశాడు. బయటకు వెళ్తున్నామని, వచ్చేస్తామని గంట గంటకు విజయారెడ్డి పెట్టినట్లుగానే మెసేజ్‌లు చేశాడు. ఈ హత్య కోసం రాధిక సాయం తీసుకున్నాడు.
సిబ్బందికి రివార్డులు
మాజీ కౌన్సిలర్ విజయారెడ్డి హత్య కేసులో నిందితులను పట్టుకున్న నగర పోలీసులకు సీపీ రివార్డులు అందజేశారు. వారి పనితీరు పట్ల సీపీ హర్షం వ్యక్తం చేశారు. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్‌లు, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు రివార్డులు అందించారు.
హేమంత్‌కుమార్‌పై పలు కేసులు
కోలా వెంకట హేమంత్‌కుమార్‌పై భీమిలి పోలీస్ స్టేషన్‌లో 2015లో ఓ కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఒక మహిళ మెడపై కత్తిపెట్టి బెదిరించి పుస్తెలతాడు దొంగలించాడని నిర్ధారణ కావడంతో న్యాయమూర్తి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
♦ ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో ఓ కేసు నమోదు చేశారు. అనంతరం అదే స్టేషన్‌లో 2016లో మరో కేసు నమోదు చేశారు.
♦ ఫోర్తుటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హేమంత్‌కుమార్‌పై 2016లో ఓ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment