చికిత్స పొందుతోన్న తండ్రీకూతుళ్లు
ఏలూరు టౌన్ : ఏలూరులో ఆదివారం జరిగిన ఎంసెట్ పరీక్ష రాసి తిరిగి ఇంటికి వెళుతుండగా ఒక బాలుడు కారు ను వేగంగా నడుపుతూ ద్విచక్ర వాహనంపై వెళుతోన్న తండ్రీ, కూతుళ్లను ఢీకొనటంతో వారిద్దరూ రోడ్డు పక్కన పొదల్లో పడిపోయారు. భయంతో కారును ఆపకుండా బాలుడు వెళ్లిపోగా, పొదల్లో పడి ఉన్న తండ్రీ, కూతుళ్లను స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇద్దరికీ తీవ్ర గాయాలు కావటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి....కృష్జాజిల్లా ఆటపాకకు చెందిన చెల్లిముంత గంగాధర్ (48), కుమార్తె చెల్లిముంత మానస (18) ఉదయం ఏలూరులో జరిగే ఎంసెట్ పరీక్ష రాసేందుకు వచ్చారు. గంగాధర్ విజయవాడలో స్టేట్‌బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు చెబుతున్నారు.
పరీక్ష ముగిసిన అనంతరం తిరిగి వెళుతుండగా, లింగారావుగూడెం వద్దకు వచ్చే సరికి వేగంగా నడుపుతూ వస్తోన్న బాలుడు కారుతో మోటారుసైకిల్‌ను ఢీకొనటంతో ఇద్దరూ ఎగిరి పొదల్లో పడిపోయారు. అయితే ఆ బాలుడు కారును ఆపకుండా వెళ్లిపోయి లింగారావుగూడెంలోని శ్మశానంలో ఆపాడని, కారుకు రక్తపు మరకలు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కారును స్వాధీనం చేసుకున్న ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment