మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్‌ఐ లొంగిపోయిన తండ్రి బ్రహ్మనాయుడు
సంతమాగులూరు: ఓ తండ్రి కన్న కొడుకును రోకలి బండతో మోది హతమార్చాడు. ఈ సంఘటన మండలంలోని వెల్లలచెరువులో శనివారం అర్ధరాత్రి జరిగింది. సీఐ హైమారావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కె.బ్రహ్మనాయుడికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు సంపత్‌కుమార్ (25). గుంటూరులో కెమెరా మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. క్రిస్మస్ సందర్భంగా అతడు స్వగ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు. శనివారం రాత్రి పూటుగా మ ద్యం తాగి ఇంటికి వచ్చి దగ్గరలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో బల్లపై పడుకున్నాడు.
కుమారుడు నిత్యం మద్యం తాగి పరువు తీస్తుండటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బ్రహ్మనాయుడు రోకలి బండతో తలపై బలంగా మోదాడు. అంతటితో ఆగకుండ బండరాయితో బాదడంతో సంపత్‌కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆదివారం ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు రక్తపు మడుగులో ఉన్న సంపత్‌కుమార్‌ను చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలి పారు. అద్దంకి సీఐ హైమారావు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
లొంగిపోయిన తండ్రి
కుమారుడిని చంపిన తండ్రి బ్రహ్మనాయుడు నేరుగా గుంటూరు వెళ్లాడు. సీఐ హైమారావు ఫోన్ చేయడంతో తాను గుంటూరులో ఉన్నానని చెప్పాడు. మధ్యాహ్న ప్రాంతంలో పోలీసుస్టేషన్‌లో లొంగిపోయినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment