
రాజాం: భూ విక్రయం విషయంలో తండ్రీకొడుకుల మధ్య తలెత్తిన మనస్పర్థలు హత్యకు దారితీశాయి. తండ్రి చేతిలో కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా రాజాంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం కూనాయవలసకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కలిపిండి సీతంనాయుడు రాజాం నగర పంచాయతీ పరిధిలోని నవ్యనగర్‌లో ఉంటున్నాడు. కుమార్తె సుహాసిని వివాహ నిమిత్తం తనకున్న భూమిని సమీప బంధువులకు అమ్మాలని నిర్ణయించాడు.
అయితే హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అతడి కుమారుడు శ్రీకాంత్‌నాయుడు ఇందుకు నిరాకరించాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వారం కిందట శ్రీకాంత్ రాజాం వచ్చాడు. గురువారం రాత్రి అతడు నిద్రపోయిన సమయంలో తండ్రి కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అతడి కేకలు విని పక్కగదిలో ఉన్న తల్లి సరోజిని బయటకు రాగా, ఆమెపైనా దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకుని శ్రీకాంత్‌నాయుడిని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ రాత్రి 1 గంటకు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment