
హైదరాబాద్: ఇద్దరు బాలుర మధ్య తలెత్తిన ఘర్షణలో కత్తిపోటుకు గురై ఒకరు గాయపడ్డారు. నాచారంలోని ఎర్రకుంటకు చెందిన అరవింద్ (16), సాయి నాథ్ (16) స్నేహితులు. వీరిద్దరూ అక్కడి ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఇదే స్కూల్‌లో అరవింద్ సోదరి సైతం చదువుతోంది. కొన్నాళ్లుగా అరవింద్ సోదరిని సాయినాథ్ వేధిస్తున్నాడనేది ఆరోపణ. ఇదే విషయంపై మందలించేందుకు అరవింద్ మంగళవారం ఉదయం సాయినాథ్ ఇంటికి వెళ్లాడు. ఇరువురి మధ్యా మాటామాటా పెరగడంతో ఆవేశానికి లోనైన సాయినాథ్ కత్తితో అరవింద్ కడుపులో పొడిచాడు. అనంతరం భయపడి పారిపోయాడు.
గాయపడిన అరవింద్‌ను స్థానికులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తు న్నారు. ఈ ఘటన నేపథ్యంలో విద్యాశాఖ ప్రతి పాఠశాలలో మానసిక శాస్త్ర నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో అభంశుభం తెలియని బాలలు నేరస్తులుగా మారుతున్నారని అన్నారు.