రాజరాజేశ్వరి ఐటీఐ కళాశాలలో ఎగసిపడుతున్న మంటలు, భయాందోళనతో బయటకు వచ్చిన విద్యార్థులు
అసలే శిథిలావస్థలో ఉన్న భవనం. అగ్నిమాపక అనుమతులు లేకుండానే ఏళ్ల తరబడిగా ఆ ఐటీఐను అక్కడ నిర్వహిస్తున్నారు. శనివారం విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా భారీ పేలుడు. అగ్ని ప్రమాదం సంభవించడంతో భయాందోళనతో విద్యార్థులు బయటకు పరుగులు తీసిన ఘటన.. పెద్దాపురం రాజరాజేశ్వరి ఐటీఐ కళాశాలలో చోటు చేసుకుంది.
సాక్షి, పెద్దాపురం(తూర్పుగోదావరి) : పట్టణ శివారు పాండవుల మెట్ట సమీపంలో రాజరాజేశ్వరి ఐటీఐ కళాశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. కళాశాల గ్రౌండ్ ఫ్లోర్‌లో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా భారీ పేలుడుతో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఉలిక్కిపడి పరీక్ష హాలు నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపకాధికారి బంగారు ఏసుబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఫైర్ సేఫ్టీ అనుమతి తీసుకోకపోవడంతో కళాశాల యాజమాన్యంపై అగ్నిమాపక అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు చెప్పిన అనుమతులు తీసుకోలేదన్నారు. పెను ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయిందని, లేకుంటే సుమారు 200 మంది విద్యార్థుల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు వాపోయారు. కళాశాల నిర్వహణ తీరుపై అధికారులు దృష్టి సారించకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. కళాశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అగ్నిమాపకాధికారి ఏసుబాబు మాట్లాడుతూ సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఫైర్ సేఫ్టీకి ఏర్పాట్లు చేసుకోవాలని కళాశాల యాజమాన్యానికి వివరించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment