అతడితోనే ‘మొదలైన’ ఐసిస్‌! | First man ISIS Salman Arrest In Hyderabad | Sakshi
Sakshi News home page

అతడితోనే ‘మొదలైన’ ఐసిస్‌!

Published Mon, Aug 13 2018 9:02 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

First man ISIS Salman Arrest In Hyderabad - Sakshi

అబ్దుల్‌ ఖదీర్‌ , అబ్దుల్లా బాసిత్‌

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగరంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ఆనవాళ్లు నాలుగేళ్ల క్రితం అబ్దుల్లా బాసిత్‌ గ్యాంగ్‌తోనే తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. శంషాబాద్‌ విమానాశ్రయంలో చిక్కిన సల్మాన్‌ మొయినుద్దీన్‌ది తొలి అరెస్టు. ఆ తర్వాత పలువురి చిక్కినా.. జేకేహెచ్, జేకేబీహెచ్‌ వంటి అనుబంధ సంస్థల కార్యకలాపాలు సాగినా... ఏడాదిగా పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చిందని పోలీసులు భావించారు. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఆదివారం అబ్దుల్లా బాసిత్‌తో పాటు ఖదీర్‌లను పట్టుకోవడంతో మరోసారి కలకలం రేగింది. 2016లో ఢిల్లీ యూనిట్‌ నమోదు చేసిన కేసులో వీరిద్దరినీ అరెస్టు చేసింది. 

‘కోల్‌కతా’ నుంచి సిటీకి...
ఐసిస్‌ భావజాల వ్యాప్తి, రిక్రూట్‌మెంట్‌ అంశాలు 2012 నుంచి భారత్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. ఉత్తరాదిలో అనేక అరెస్టులు సైతం చోటు చేసుకున్నాయి. అయితే 2014 సెప్టెంబర్‌లో వరకు దీని ఛాయలు సిటీలో ప్రత్యక్షంగా కనిపించలేదు. ఆ నెల్లో అబ్దుల్లా బాసిత్‌ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్‌ మీదుగా దేశ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్‌ చేరుకుని, అక్కడ నుంచి సిరియా వెళ్ళేందుకు ప్రయత్నించిన  మాజ్, అబ్రార్, నోమన్‌లను పోలీసులు కోల్‌కతాలో పట్టుకున్నారు. ఈ నలుగురినీ హైదరాబాద్‌కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ చేసి విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 మంది ఐసిస్‌ ఆకర్షితుల్ని గుర్తించిన పోలీసులు కౌన్సెలింగ్‌ చేసి వదిలిపెట్టారు.

ఫస్ట్‌ మ్యాన్‌ సల్మాన్‌...
హబీబ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని బజార్‌ఘాట్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి సల్మాన్‌ మొహియుద్దీన్‌ నిక్కీ జోసఫ్‌ అనే మహిళ ద్వారా ఐసిస్‌ వల్లో చిక్కాడు. ఫేస్‌బుక్‌ ఆధారంగా గాలం వేసిన జోసఫ్‌... దుబాయ్‌ మీదుగా సిరియా వెళ్లేందుకు ఇతడిని సిద్ధం చేసింది. ఆ ప్రయాణంలో ఉండగానే 2015 జనవరి 16న శంషాబాద్‌ విమానాశ్రయంలో సల్మాన్‌ చిక్కాడు. నగరంలో ఐసిస్‌కు సంబంధించిన తొలి అరెస్టు ఇదే.

జోసఫ్‌ కాదు అఫ్షా...
నిక్కీ జోసఫ్‌ పేరుతో సల్మాన్‌ను ఆకర్షించి, ఉగ్ర ఉచ్చులోకి దింపింది దుబాయ్‌లో ఉంటున్న అఫ్షా జబీన్‌గా పోలీసులు గుర్తించారు. హిమాయత్‌నగర్‌కు చెందిన ఈమె కొంతకాలంగా దుబాయ్‌లో కుంటుంబంతో సహా నివసిస్తూ ఐసిస్‌ ఏజెంట్‌గా పని చేస్తోంది. డిపోర్టేషన్‌ పద్దతిలో హైదరాబాద్‌ రప్పించిన జబీన్‌ను 2015 సెప్టెంబర్‌ 11న శంషాబాద్‌ విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. ఈమెవిచారణలో దేశ వ్యాప్తంగా ఐసిస్‌ వైపుఆకర్షితులైన అనేక మంది వివరాలు వెలుగులోకి వచ్చాయి. 

ఐసిస్‌ త్రయం అరెస్టు...
2014 సెప్టెంబర్‌లో దేశ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ కోల్‌కతాలో చిక్కిన నలుగురిలో అబ్దుల్‌ బాసిత్‌తో మాజ్‌ హసన్‌ ఫారూఖ్‌ కూడా ఉన్నాడు. వీరిద్దరూ నగరానికే చెందిన ఫారూఖ్‌ హుస్సేనీతో కలిసి మరోసారి ఐసిస్‌ వైపు పయనమయ్యారు. నాగ్‌పూర్‌ మీదుగా శ్రీనగర్‌ వెళ్లేందుకు ప్రయత్నించి 2015 డిసెంబర్‌ 28నఅక్కడి విమానాశ్రయంలో పట్టుబడ్డారు. దీరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఆపై జేకేహెచ్‌... జేకేబీహెచ్‌ మాడ్యుల్స్‌...
2016 నుంచి ఐసిస్‌ తన పంథా మార్చింది. సిరియాకు రప్పించి ‘యుధ్ధం’ చేయించడం కంటే దేశీయంగా ఉన్న యువతను రెచ్చగొట్టి ఇక్కడే విధ్వంసాలకు ప్రేరేపించాలని నిర్ణయించుకుంది. దీనికోసం జునూద్‌ అల్‌ ఖలీఫా ఏ హింద్‌ (జేకేహెచ్‌) పేరుతో మాడ్యుల్‌ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి 2016 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 16 మందిని పట్టుకున్నారు. వీరిలో టోలిచౌకి, మాదాపూర్‌ ప్రాంతాలకు చెందిన నఫీజ్‌ ఖాన్, ఒబేదుల్లా ఖాన్, షరీఫ్‌ మొయినుద్దీన్‌ ఖాన్, అబు అన్స్‌ సైతం ఉన్నారు. ఆపై అదే ఏడాది జూన్‌లో జునూద్‌ అల్‌ ఖలీ ఫీ బిలాద్‌ అల్‌ హింద్‌ (జేకేబీహెచ్‌) మాడ్యుల్‌ ఏర్పాటు కావడంతో  దీని సౌత్‌ ఇండియా ఇన్‌చార్జ్‌గా భావిస్తున్నా మహ్మద్‌ ఇబ్రహీం యజ్దానీ సహా ఏడుగురిని అరెస్టు చేశారు.  
2017 జూలైలో సిట్‌ పోలీసులు అరెస్టు చేసిన కొనకళ్ళ సుబ్రహ్మణ్యం అలియాస్‌ ఒమర్‌దే ఐసిస్‌ కోణంలో ఆఖరి ఉదంతం. ఏపీలోని కృష్ణాజిల్లాకు చెందిన ఇతగాడు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన వారి ప్రోద్భలంతో మతం మారడంతో పాటు ఉగ్రవాదబాటపట్టాడు. పాస్‌పోర్ట్‌ లేనికారణంగా సిరియా వెళ్ళే చాన్స్‌ లేకపోవడంతో దేశీయంగానే విధ్వంసాలు సృష్టించాలని భావించాడు. ఇతడి వ్యవహారం గుర్తించిన నిఘా వర్గాలు సిట్‌కు సమాచారం ఇవ్వడంతో పట్టుబడ్డాడు. ఆపై ఏడాది తర్వాత తాజాగా ఆదివారం బాసిత్, ఖరీద్‌లు అరెస్టు అయ్యారు.  

ఖదీర్‌ నేపథ్యం ఇదీ...
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన అనాథాశ్రమం ఉద్యోగి అబ్దుల్‌ ఖుద్దూస్‌ కుమారుడే అబ్దుల్‌ ఖదీర్‌. ప్రస్తుతం చంద్రాయణగుట్టలో నివసిస్తున్న ఖదీర్‌ బాసిత్‌ ప్రభావంతోనే ఐసిస్‌ వైపు ఆకర్షితుడయ్యాడు. 2015లో పదో తరగతి ఫెయిల్‌ అయిన ఇతగాడు ఓ ఇంటర్‌నెట్‌ సెంటర్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతడి మేనత్తతో పాటు కొందరు బంధువులు పాకిస్థాన్‌లో ఉంటారు. వాస్తవానికి ఈ నెల 10న ఓ శుభకార్యం కోసం కుటుంబంతో కలిసి అక్కడకు వెళ్ళాల్సి ఉంది. అయితే ఏడో తేదీ నుంచే ఎన్‌ఐఏ విచారణకు హాజరుతుండటంతో సాధ్యం కాలేదు. ఇతడి నుంచి ఎన్‌ఐఏ అధికారులు కొన్ని నిషేధిత వస్తువులు సైతం స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

బాసిత్‌ చరిత్ర ఇలా...
చంద్రాయణగుట్టలోని హఫీజ్‌బాబానగర్‌కు చెందిన బాసిత్‌ ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ (సీఎస్‌ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. 2014 ఆగస్టులో కోల్‌కతాలో పట్టుబడటంతో యాజమాన్యం కళాశాల నుంచి పంపించేసింది. హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియల్‌ డిజైనింగ్‌ కోర్సులో  చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. 2015 డిసెంబర్‌లో ఐసిస్‌లో చేరేందుకు వెళ్ళిపోతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి వెళ్ళిపోయాడు. అదే నెల 28న సిట్‌ పోలీసులు నాగ్‌పూర్‌లో పట్టుకుని అరెస్టు చేశారు. తాజాగా ఎన్‌ఐఏ అధికారులు ఇతడి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ నుంచి కీలక సమాచారం సేకరించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement