
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని షమ్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి గడిచిన 48 గంటల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారని అధికారులు వెల్లడించారు. షమ్లీ, కర్నాల్ (హర్యానా) జిల్లాల్లో దాదాపు 15 మంది వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు దేశీ మద్యం తాగారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటనపై షమ్లీ జిల్లా మేజిస్ర్టేట్ ఇంద్ర విక్రం సింగ్ విచారణకు ఆదేశించారు.
గ్రామంలో నాటు సారా తాగి స్ధానికులు మరణించారన్న సమాచారంతో తాము గ్రామానికి చేరుకోగా బాధితులు కల్తీ మద్యంపై ఫిర్యాదు చేయలేదన్నారు. పోస్ట్‌మార్టం నివేదికతో వాస్తవాలు వెలుగుచూశాయని షమ్లీ ఎస్పీ వెల్లడించారు. పొరుగున ఉన్న హర్యానాలో తక్కువ ధరకు దేశీ మద్యం లభ్యం కావడంతో అక్కడి నుంచి కల్తీ మద్యం అక్రమంగా సరఫరా అవుతోందని పోలీసులు భావిస్తున్నారు. కల్తీ మద్యంపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత వినోద్ నిర్వాల్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment