ఆరిపోయిన ఇంటి దీపాలు | Five Dead in Crackers Blast Incident East Godavari | Sakshi
Sakshi News home page

ఆరిపోయిన ఇంటి దీపాలు

Published Fri, Oct 4 2019 1:17 PM | Last Updated on Fri, Oct 4 2019 1:17 PM

Five Dead in Crackers Blast Incident East Godavari - Sakshi

విషాదంలో మృతుల కుటుంబ సభ్యులు

దీపావళి రోజున వెలుగులు నింపడానికి బాణసంచా తయారీలో పనికి కుదిరిన ఆ కూలీల జీవితాల్లో విషాదమే మిగిలింది. వ్యవసాయ పనులేవీ లేకపోవడంతో నెల రోజుల ఉపాధి కోసం వెళ్లిన ఈ ఐదుగురూ మృత్యువుతో పోరాడి అసువులు బాశారు. బుధవారం ఇద్దరు, గురువారం ముగ్గురు మృత్యువాత పడడంతో సామర్లకోట మండల పరిధిలోని వేట్లపాలెం శివారు కాలనీల్లో కన్నీరు గూడుకట్టుకుంది. తెలతెలవారుతుండగానే... సూరీడు పొద్దు పొడవకముందే  ఆ గ్రామంలో కూలీలు నిద్రలేచి కూటి కోసం పరుగులు తీస్తారు. రోజూలాగానే 12 మంది కూలీలందరూ కలసి గత నెల 30వ తేదీన బాణసంచా తయారీ పనులకు వెళ్లారు. గత నెలాఖరు... అదే వారి జీవితాల్లో ఆఖరి ఘడియలని తెలుసుకోలేకపోయారు. వారి బతుకులతో విధి ఆడిన వికృత క్రీడకు ఆ ఇంటి దీపాలు ఆరిపోయాయి.

సామర్లకోట (పెద్దాపురం): మండలంలోని వేట్లపాలెం–జి.మేడపాడు మధ్య కెనాల్‌ రోడ్డులో ఉన్న ఇందిరా ఫైర్‌ వర్క్స్‌లో గత సోమవారం బాణసంచా తయారీ చేస్తుండగా జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. వేట్లపాలెం శివారు ప్రాంతం గూడపర్తి, జొన్నలదొడ్డికి చెందిన 12 మంది సోమవారం బాణసంచా తయారు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించిన విషయం విదితమే. ఈ సంఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడగా, వారిని మెరుగైన వైద్యం  కోసం  వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో కాకినాడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ క్షతగాత్రులైన బంటు చెల్లాయ్యమ్మ (45) మాకిరెడ్డి నూకాలమ్మ (70) బుధవారం మృతి చెందగా, బత్తిన లోవ కుమారి (45) కాకర అనిత(30) కొంగు లక్ష్మి(55) గురువారం మృతి చెందారు. క్షతగాత్రులు మృతి చెందిన విషయం తెలియడంతో వేట్లపాలెంలోని శివారు ప్రాంతాలైన జొన్నలదొడ్డి, గూడపర్తిలలో విషాదఛాయలు అలముకున్నాయి. బంటు చెల్లాయ్యమ్మకు ఇద్దరు కుమార్తెలు. వారికి పెళ్లిళ్లు చేసింది. భర్తను పోషించడానికి కూలి పనికి వెళ్లి పేలుడు ప్రమాదంలో చనిపోయింది. మాకిరెడ్డి నూకాలమ్మ వృద్ధాప్యంలోనూ కుటుంబపోషణకు వెళ్లి బలైంది.

బత్తిన లోవకుమారికి భర్త, ఇద్దరు కుమార్తెలు. బాణసంచా తయారీ పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. నాలుగు రోజులుగా తన తల్లి కనిపించకపోవడంతో ఏడో తరగతి, నాలుగో తరగతి చదువుతున్న చిన్నారులు బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నారు. గురువారం తల్లి మృతి చెందిన విషయం తెలిసి చిన్నారులతో పాటు ఆ ప్రాంత ప్రజలు విషాదంలో మునిగిపోయారు. కాకర అనితకు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒక కుమార్తె ఇంటర్, మరో కుమార్తె ఆరో తరగతి చదువుతున్నారు. సోమవారం నుంచి తండ్రి దుర్గారావుతోపాటు వారు కూడా కంటిపై కునుకు లేకుండా ఉన్నారు. గురువారం అనిత మరణ వార్తతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. కొంగు లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమారుడికి వివాహమైంది. చిన్నకుమారుడుకి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో ఆమె లేకుండా పోయిందని ఆమె బంధువులు రోదించారు. మృతదేహాలను ఇళ్లకు తీసుకువెళ్లకుండా కాకినాడ నుంచి నేరుగా వేట్లపాలెంలోని శ్మశాన వాటికకు గురువారం రాత్రి తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు.

ఆందోళనతో విజయం సాధించాం
బాణసంచా పేలుడు ప్రమాదంలో క్షతగాత్రులు మృతి చెందడంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించామని దళిత నాయకులు లింగం గంగాధర్, లింగం శివప్రసాద్, వల్లూరి సత్తిబాబు, సరిపల రాజేష్, సిద్ధాంతుల కొండబాబు, పి.జనార్దన్‌లు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చారని వారు తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయంతో పాటు, ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు.

ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు
దళిత సంఘాల ఆందోళనకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వెంటనే స్పందించారని వైఎస్సార్‌ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు తెలిపారు. మృతి చెందిన వారి, క్షతగాత్రుల ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రికి మంత్రి కన్నబాబు వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించి మృతి చెందిన వారికి రూ.పది లక్షలు, క్షతగాత్రులకు రూ.నాలుగు లక్షలు ఇవ్వడానికి అంగీకరించారని దొరబాబు స్థానిక విలేకర్లకు తెలిపారు. వీరి కుటుంబాలకు అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని దొరబాబు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement