సురేష్ కుటుంబ సభ్యులు(ఫైల్ ఫొటో)
అనుకున్న పని పూర్తి చేసి ఇంటికి తిరుగు ప్రయాణమైన వారికి మృత్యువు ఎదురొచ్చింది. జిల్లాలో నల్లజర్ల, ఆకివీడుల వద్ద జరిగిన ఈ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. తల్లిదండ్రులను కాశీ ట్రైన్ ఎక్కించేందుకు దించి నానోకారులో బయలుదేరిన కుటుంబాన్ని లారీ మృత్యువు రూపంలో కబళించింది. మరోచోట మత్స్యమేళాలో పాల్గొని సొంతిళ్లకు మోటార్ సైకిల్‌పై బయలుదేరిన యువకులను ఆర్టీసీ ప్రైవేటు బస్సు పొట్టన పెట్టుకుంది. ఈ రెండు ప్రమాదాలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఆ వివరాలు ఇలా..
జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నానో కారును లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. నల్లజర్ల ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన జోస్యుల రామజోగేశ్వరశర్మ కుమారుడు సురేష్ భార్య సుధ రెండుమాసాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అస్తికలను కాశీ తీసుకెళ్లేందుకు రామజోగేశ్వరశర్మ, అతని భార్య లక్ష్మి సోమవారం నానోకారులో విజయవాడ బయలు దేరారు. వారితో పాటు ఆయన కుమారుడు సురేష్(30), అతని కుమార్తెలు సువర్చల, నిశ్చల, రామజోగేశ్వరశర్మ కుమార్తె సత్య సుధా దేవి(30), సురేష్ బావమరిది, మల్లేపల్లికి చెందిన పోడూరి సురేంద్ర ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం ట్రైన్‌కు జోగేశ్వరశర్మ, లక్ష్మి వెళ్లాల్సి ఉంది. వారిరువురిని విజయవాడలో దించి మిగిలిన వారంతా స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 12 గంటల సమయంలో అనంతపల్లి శివారుకు వచ్చేసరికి విశాఖపట్నం నుంచి కెమికల్ లోడుతో జీడిమెట్ల వెళ్తున్న లారీ మరో లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న నానో కారును ఢీకొంది. ఈ ఘటనలో జోగశ్వరశర్మ కుమార్తె, కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన సత్య సుధాదేవి(30), సురేష్ చిన్న కుమార్తె నిశ్చల(21 నెలలు)అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సురేష్ పెద్ద కుమార్తె సువర్చల, అతని బావమరిది సురేంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న మృత్యువు!
పెద్దాపురానికి చెందిన రామజోగేశ్వరశర్మ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతుందా? అంటే అవుననే అంటున్నారు ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు. రెండు నెలల వ్యవధిలోనే ఆయన కుటుంబంలో నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో కాకర్ల వారి వీధిలో ఉంటున్న రామజోగేశ్వరశర్మ పౌరహిత్యం చేస్తూ ఆ గ్రామస్తులకు మంచిచెడ్డలకు పెద్దదిక్కుగా ఉంటున్నారు. వివిధ దేవాలయాల్లో పూజాధికాలు నిర్వహించడం, పంచాగశ్రవణంలోను, ముహూర్తాలు పెట్టడంలోను ఆయన దిట్ట. ఆయన అడుగుజాడల్లోనే కొడుకు సురేష్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. రెండు నెలల క్రితమే సురేష్ భార్య సంధ్య(28) అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె ఆస్తికలను కాశీలోని గంగలో కలిపేందుకు తీసుకువెళ్తుండగా
ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం అర్ధరాత్రి నాటి రోడ్డు ప్రమాదంలో కొడుకు సురేష్, కూతురు సత్య సుధాదేవి, మనవరాలు నిశ్చల మృత్యువాతపడ్డారు. సురేష్‌కు ఇద్దరు ఆడ పిల్లలు చిన్న వాళ్లు కావడంతో వారిని సాకడానికి కొడుక్కి రెండో పెళ్లి చేసే ఉద్దేశంతో కోడలు దహన సంస్కారాలకు ఆయనే తలకొరివి పెట్టి కర్మకాండలు చేసినట్టు బంధువులు చెబుతున్నారు. ఆమె అస్తికలు కాశీ తీసుకెళ్లి గంగలో కలపడానికి కుటుంబం అంతా బయలుదేరగా మృత్యువు వెంటాడిందని బంధువులు చెబుతున్నారు.
గుండెలవిసేలా రోదన∙
సురేష్ ఐదేళ్ళ పెద్ద కుమార్తె సువర్చల తండ్రిని జీవచ్చవంలా చూసి స్పృహతప్పి పడిపోయింది. అదే కారులో ప్రయాణిస్తున్న సురేష్ బావమరిది సురేంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతనిచ్చిన సమాచారంతో కాశీ వెళ్లాల్సిన జోగేశ్వర శర్మ దంపతులు వెనుతిరిగి వచ్చి కొడుకు, కూతురు, మనవరాలు మృతదేహాలు చూసి గుండెలవిసేలా రోదించారు. ఇదే ప్రమాదంలో మృతిచెందిన కోరుకొండ మండలం దోసకాయల పల్లికి చెందిన జోగేశ్వరశర్మ కుమార్తె సత్య సుధాదేవికి భర్త పొన్నా సత్యకృష్ణ వర్థన రాజు, తొమ్మిదేళ్ల కొడుకు కల్యాణ్, ఏడేళ్ల కుమార్తె లక్ష్మి ఉన్నారు. నా పిల్లలకు దిక్కెవరూ అంటూ ఆమె భర్త విలపించారు. మంగళవారం ఉదయం మానవత సంస్థ వాహనంలో మృత దేహాలను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment