లక్ష్మి(ఫైల్) లత, వర్ణిక (ఫైల్) సుస్మిత (ఫైల్)
కర్ణాటకలోని భద్రావతిలో ఏటా జరిగే జాతరకు వెళ్లొస్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన ఆ కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో అధికులు చిత్తూరు మండలంలోని కుర్చివేడు గ్రామస్తులు కావడంతో ఊరంతా కన్నీటి సంద్రమైంది.
చిత్తూరు రూరల్: కర్ణాటకలోని బెంగళూరు–పుణె జాతీయ రహదారి హిరియూరు తాలూకా మేడికుర్కి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. చిత్తూరు మండలం కుర్చివేడుకు చెందిన మోహన్‌నాయుడు, ఆయన భార్య లక్ష్మి (తాయమ్మ) పుట్టినిల్లైన కర్ణాటకలోని భద్రావతికి ఆదివారం కారులో వెళ్లారు. ఏటా అక్కడ జరిగే జాతరకు క్రమం తప్పకుండా వెళ్లడం వీరి ఆనవాయితీ. మంగళవారం భద్రావతిలోని బండే మారెమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులంతా జాతరలో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. బుధవారం మధ్యాహ్నం స్వగ్రామానికి తిరుగుముఖం పట్టారు. హిరియూరు తాలూకా, మేడుకుర్కి వద్ద కారు ముందరి టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. బెంగళూరు–పుణే జాతీయ రహదారి 48 రోడ్డుపై డివైడర్‌ను దాటుకుని పల్టీలు కొడుతూ ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొంది. ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడిక్కడికే మృత్యువాత పడ్డారు.
మృతుల వివరాలు
లక్ష్మి అలియాస్ తాయమ్మ (50), లత (26), వర్ణిక (09), జాహ్నవి (3), సుశ్మిత (13) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మోహన్‌నాయుడు భార్య లక్ష్మి, కోడలు లత, మనవరాలు వర్ణిక ఉన్నారు. వీరి మృతదేహాలు కుర్చి వేడు గ్రామానికి తీసుకొచ్చారు. పెద్దకుమార్తె కూతురు జాహ్నవి మృతదేహాన్ని పాలసముద్రం మండలంలోని ఆముదాల గ్రామానికి, బావమరిది కుమార్తె సుశ్మిత మృతదేహాన్ని బెంగళూరుకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
కన్నీటి పర్యంతమవుతున్న మోహన్‌నాయుడు చిన్న కుమార్తె మంజుల
నలుగురికి గాయాలు
ఈ ప్రమాదంలో మోహన్‌నాయుడికి వెన్నెము క విరిగింది.ఆయన కుమారుడు ప్రకాష్ తలకు, పెద్ద కుమార్తె ద్రాక్షాయణి కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ద్రాక్షాయణి పెద్ద కుమార్తె లిఖిత స్వల్ప గాయాలతో బయటపడింది. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం అక్కడి ఆసుపత్రికి తరలించారు. గురువారం మధ్యాహ్నం మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి. దీంతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. గ్రామంలో ఇది వరకు ఎన్నాడు లేని విధంగా ఒకే కుటుంబానికి ఐదుగురు మృతి చెందడం గ్రామస్తులు, బంధువులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన మోహన్‌నాయుడు కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. అయితే జిల్లాలో కరవు పరిస్థితులు, వ్యవసాయం చేయడం భారమైన నేపథ్యంలో మోహన్‌నాయుడు కుమారుడు ప్రకాష్ కొంతకాలంగా బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment