
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ)లతో రూ.కోట్లు డ్రా చేసుకున్న కేసులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకట ప్రసాద్‌కు ఇక్కడి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. అదే సమయంలో రూ.5.10 లక్షల జరిమానా కూడా విధించింది.
ఇదే కేసులో ఎస్‌బీఐ హుస్సేనీఆలం బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ నరసింగరావుకు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.45 వేల జరిమానా, అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ వెంకటమోహన్‌కు మూడేళ్ల జైలుశిక్ష, రూ.35 వేల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. గతంలో హైదరాబాద్ సనత్‌నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)ను కూడా ఇదే రీతిలో మోసం చేసిన కేసులో కందికుంటకు ఏడేళ్ల జైలుశిక్ష వి«ధిస్తూ 2016లో కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
కేసు పూర్వాపరాలివీ..: కాగా 2003లో ఎస్‌బీఐ హుస్సేనీఆలం బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసిన నరసింగరావు ఉన్నతాధికారులకు తెలియకుండా బ్యాంకు నుంచి ఖాళీ డీడీలు తీసుకొచ్చారు. వీటిని ఆ ప్రాంతంలో ఎస్.ఐ.గాపనిచేస్తున్న వెంకటమోహన్‌కు ఇచ్చారు. వాటిని ఆయన కందికుంట ప్రసాద్‌కు అందచేశారు. ఈ ఖాళీ డీడీలతో పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేయాలన్న కుట్రకు కందికుంట తెరతీశారు. ఆ డీడీల్లో కొన్నింటిని నగదుగా మార్చుకోకపోవడంపై అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తీర్పు అనంతరం నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment