జ్యోష్ణ మృతదేహాన్ని కాలువ నుంచి పైకి తెస్తున్న గ్రామస్తులు
తూర్పుగోదావరి ,వీఆర్‌పురం (రంపచోడవరం): మండలంలోని వలస ఆదివాసీ గ్రామం సున్నం మట్కాలో ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ నీటి గుంతలో పడిన ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం ఈ గ్రామానికి చెందిన మడకం కోసయ్య దేవీ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె జ్యోష్ణ (5) ఉన్నారు. స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో ఆమె చదువుకుంటోంది. ఆదివారం సెలవు కావడంతో ఆమెతో పాటు మరికొంతమంది ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో ఆడుకొంటున్నారు. వర్షపు నీటి నిల్వ కోసం అటవీ శాఖ తవ్వించిన ట్రెంచింగ్ (కందం) కాలువ వద్దకు వెళ్లిన వారు కాలువలో తలో రాయ వేస్తుండగా జ్యోష్ణ కాలుజారి నీటిలో పడి మునిగి పోయింది. మిగిలిన పిల్లలు భయంతో పరుగున వెళ్లి పెద్దలకు చెప్పారు. వారు కాలువ వద్దకు వచ్చి ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందింది. బాలిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండులు, కుటుంభ సభ్యులు బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment