మనం తాగేనీరు మంచిదేనా? | Fluoride Problem Facing in Kurnool People | Sakshi
Sakshi News home page

మనం తాగేనీరు మంచిదేనా?

Published Fri, Feb 21 2020 12:01 PM | Last Updated on Fri, Feb 21 2020 12:01 PM

Fluoride Problem Facing in Kurnool People - Sakshi

లీటరు నీటిలో మెగ్నీషియం 100 మిల్లీ గ్రాముల వరకు ఉండాలి. ఆళ్లగడ్డ మండలం కందుకూరులో 126, గోస్పాడు మండలం జిల్లెల్లలో 160, చిప్పగిరి మండలం ఎర్నూరులో 184, ఆలూరులో 204, హొళగుందలో 165, ఆస్పరి మండలం హలిగేరలో 277, కల్లూరు మండలం చిన్న టేకూరులో 214, మంత్రాలయం మండలం బసాపురంలో 287, వెలుగోడు మండలం పంగిడిగూడెంలో 160, కోడుమూరు మండలం పులకుర్తిలో 151, గూడూరు మండలం నాగులాపురంలో 190, పాణ్యం మండలం గగ్గటూరులో 140 ప్రకారం మెగ్నీషియం ఉన్నట్లు స్పష్టమవుతోంది.నీటిలో కాల్షియం లీటరు నీటికి 200లోపు మిల్లీ గ్రాములు ఉండాలి. ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురంలో 232, మంత్రాలయం మండలం బసాపురం గ్రామంలో 432, హొళగుందలో 256, ఆస్పరి మండలం హళిగెరలో 456, అవుకులో 296, చిప్పగిరి మండలం రామదుర్గంలో 232, నంద్యాల మండలం పోలూరులో 256, వెంకటేశ్వరాపురంలో 280, పాణ్యం మండలం గోనవరంలో 360 ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

కర్నూలు(అగ్రికల్చర్‌): వేసవి వస్తోంది... భూగర్భ జలాలు అడుగుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో నీటి నాణ్యతా ప్రమాణాలు కూడా దెబ్బతింటున్నాయి. సాధారణంగా నీటి నాణ్యతలో పీహెచ్, కరిగిన ఘనపదార్థాలు (టీడీఎస్‌), ఫ్లోరైడ్, మొత్తం కాఠిన్యం, నైట్రేటు, కాల్షియం, మెగ్నిషియం, క్లోరైడ్, సల్ఫేటు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇవి మోతాదు వరకు ఉంటే ఎటువంటి ప్రమాదం లేదు. అంతకు మించితేనే సమస్య. భూగర్భ జలాలు జనవరిలో 9.5 మీటర్లు ఉండగా..ప్రస్తుతం 10.25 మీటర్లకు పడిపోయాయి. జలాలు అడుగుకు వెళ్లే కొద్దీ లవణాల మోతాదు పెరుగుతుందని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లోని నీటిలో ఫ్లోరైడ్, నైట్రేటు, క్లోరైడ్, సల్ఫేటు తదితరవన్నీ మోతాదుకు మించి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య 14 గ్రామాలను వేధిస్తోంది. దీనిని తగ్గించుకోవడానికి నీటిని ఫిల్టర్‌ చేసుకోవడంతోపాటు మిక్స్‌డ్‌ వాటర్‌ మేనేజ్‌మెంటును పాటించాల్సి ఉందని భూగర్భ జలవనరులశాఖ అధికారులు çసూచిస్తున్నారు.

నీటిలో ఏవేవి ఎంత మోతాదులో ఉండాలి..
నీటిలో పీహెచ్‌ లీటరు నీటికి మిల్లీ గ్రామలు  6.5 నుంచి 8.5 వరకు ఉండాలి. ఈ మోతాదు దాటితే పైపులకు నష్టం చేకూరుతుంది. పరిమితి దాటితే జీర్ణాశయంలోని జిగురు పొర దెబ్బతింటుంది. చర్మ వ్యాధులు కనిపిస్తాయి.  
లీటరు నీటికి 1 నుంచి 1.5 మిల్లీ గ్రాముల వరకు ఫ్లోరైడ్‌ ఉండవచ్చు. ఈ మోతాదును దాటితే దంతాలకు గారపట్టడం, ఎముకల సమస్యలు ఏర్పడటం, రోగనిరోధక శక్తి తగ్గడం, అంగవైకల్యంతో పాటు కీళ్లనొప్పులు, చిన్న వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి.
మొత్తం కాఠిన్యం 200 నుంచి 600 వరకు ఉండవచ్చు. ఈ మోతాదును దాటితే నీటి సరఫరా వ్యవస్థలో/ నిర్మాణాల్లో పొరలు, పొలుసులు ఏర్పడతాయి. సబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఈ నీటిని తాగితే శరీరం బలహీనపడుతుంది.  
నీటిలో నైట్రేటు 45లోపు వరకు ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఉంటే నీటి కాలుష్యం ఏర్పడినట్లు సూచన. మితయోగ్లోబిమియా అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది.   
కాల్షియం  200 లోపు ఉంటే ఎటువంటి ప్రమాదం లేదు. ఇంతకంటే ఎక్కువగా ఉంటే నీటి నిర్మాణాల్లో పొరలు, పొలుసులు ఏర్పడుతాయి. గృహ అవసరాలపై అననుకూల ప్రభావం చూపుతాయి.  
మెగ్నీషియం 100లోపు ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఉంటే  నిర్మాణాల్లో పొరలు, పొలుసులు ఏర్పడుతాయి. గృహ అవసరాలపై అననుకూల ప్రభావం చూపుతాయి.  
నీటిలో క్లోరైడ్‌ 1000లోపు వరకు ఉండవచ్చు. ఇంతకంటే ఎక్కువ మోతాదులో  ఉంటే నీరు రుచి కోల్పోతుంది. జీర్ణక్రియ వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉంది. గుండె, మూత్రపిండాల రుగ్మతలు ఉన్న వారిలో ఈ నీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  
నీటిలో సల్ఫేటు 400 వరకు ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఉంటే జీర్ణకోశంలో అసౌకర్యం కలిగిస్తుంది.

19 గ్రామాల్లో మోతాదుకు మించి కరిగిన ఘన పదార్థాలు....
వివిధ గ్రామాల్లోని నీటిలో కరిగిన ఘనపదార్ధాలు మొతాదు కంటే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. తాగు నీటిలో ఇవి 500 నుంచి 2000 వరకు, సాగు నీటిలో 2500 వరకు ఉండాలి. ఆదోని మండలంలోని పెద్దహరివణంలో 5050, కల్లుబావిలో 3334, విరుపాపురంలో 4147, మంత్రాలయం మండలం సూగూరులో 3891,  సాపురంలో 4467, ఉయ్యలవాడ మండలం కాకరవాడలో 7219, ఒంటెద్దుపల్లిలో 3898, కోవెలకుంట్ల మండలం వల్లంపాడులో 9645, పొటిపాడులో 10170, సంజామల మండలం యగ్గోనిలో 4755, కమలాపురిలో 8666, ఆలూరు మండలం మొలగవెల్లికొట్టాలలో 8915, గూడూరులో 2778, హాలహర్వి మండలం చింతకుంటలో 4352, నందికొట్కూరులో 4186, బనగానపల్లె మండలం అప్పలాపురంలో 4915, నంద్యాల మండలం వెంకటేశ్వరాపురంలో 5786, సి.బెళగల్‌ మండలం పోలకల్‌లో 5901, దైవందిన్నెలో 12461 ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

14 గ్రామాల్లో ఫ్లో‘రైడ్‌’  
నీటిలో ఫ్లోరైడ్‌ లీటరు నీటికి 1 నుంచి 1.5 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. కల్లూరు మండలం పెద్దపాడులో 3.46, పర్లలో 3.36, మంత్రాలయం మండలం చిన్నకొప్పెర్లలో 3.7, గుంటుపల్లిలో 4.0, గొల్లపల్లిలో 3.3, కోవెలకుంట్ల మండలం వెలగటూరులో 5.5, రేవనూరులో 2.25, ఆదోని మండలం పెద్దహరివాణంలో 3.90, సి. బెళగల్‌ మండలం పోలకల్‌లో 5.0, కోసిగి మండలం కందుకూరులో 2.30, కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో 2.57, పెద్దకడుబూరు మండలం జాలవాడిలో 2.91, నందవరం మండలం కనకవీడులో 2.82, మిడుతూరు మండలం ఖాజీపేటలో 2.0 మిల్లీ గ్రాముల ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఫ్లోరైడ్‌ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

నైట్రేట్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాలు 13...  
నీటిలో నైట్రేటు లీటరు నీటికి 45 మిల్లీ గ్రామాలు లోపు వరకే ఉండాలి. గోస్పాడు మండలం జిల్లెల్లలో 69, ఎం.కృష్ణాపురంలో 86, సి.బెళగల్‌ మండలం కొండాపురంలో 80, కౌతాళం మండలం బదినేహాల్‌లో 97, పాణ్యం మండలం మద్దూరులో 86, మంత్రాలయం మండలం మాలపల్లిలో 85, హాలహర్వి మండలం చింతకుంటలో 93, ఉయ్యాలవాడ మండలం రూపనగుడిలో 91, అవుకు మండలం చనుగొండ్లలో 105, ఉప్పలపాడులో 96, దొర్పిపాడులో మండలం గోవిందిన్నెలో 75, ఎమ్మిగనూరు మండలం సిరాళదొడ్డి గ్రామంలో 52, ఆస్పరి మండలం హొలగొందలో 65 వరకు ఉన్న పరీక్షల్లో స్పష్టమవుతోంది.

క్లోరైడ్‌ ప్రభావం ఇలా ఉంది...
నీటిలో క్లోరైడ్‌ లీటరు నీటికి 1000 మిల్లీ గ్రాములు ఉండాలి. కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తిలో 1250, పెద్దకొప్పుర్లలో 1070, ఆస్పరి మండలం హళిగేరలో 1020, హలహర్విలో 1050, చిప్పగిరి మండలం రామదుర్గంలో 1030, గోస్పాడు మండలం జిల్లెల్లలో 1010, కౌతాళం మండలం రౌడూరులో 1050, కోవెలకుంట్ల మండలం పొటిపాడులో 1060, ఆదోని మండలం కల్లుబావిలో 1070, గూడూరు మండలం నాగలాపురంలో 1110 ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

మొత్తం కాఠిన్యత ఎక్కువగా ఉన్నప్రాంతాలు ఇవే(హర్డ్‌నెస్‌)
నీటిలో మొత్తం కాఠిన్యత లీటరు నీటికి 200 నుంచి 600 మిల్లీగ్రాములు వరకు ఉండాలి. పాణ్యం మండలం వద్దుగండ్లలో 1019, ఆస్పరి మండలం హలిగేరలో 2280, ఉయ్యాలవాడ మండలం బోడెమ్మనూరులో 1658, కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తిలో 1398, గూడూరులో 1001, మంత్రాలయం మండలం బసాపురంలో 2261, గోస్పాడు మండలం జిల్లెల్లలో 1040, హొళగొందలో 1320, పాణ్యం మండలం గోనవరంలో 1380 ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

15 గ్రామాల్లోని నీటిలో మోతాదుకు మించి పీహెచ్‌ ..  
నీటిలో పీహెచ్‌ 6.5 నుంచి 8.5 వరకు ఉండవచ్చు. అయితే పలు ప్రాంతాల్లో 9 కంటే ఎక్కువగా ఉండటం గమానార్హం. జిల్లాలో గరిష్టంగా లీటరు నీటికి 10 మిల్లీ గ్రాములు ఉండటం గమానార్హం.  ఇటువంటి నీరు తాగడానికి, సాగుకు పనికిరాదు. చాగలమర్రి మండలం ముత్యాలపాడులో 9.1, గోస్పాడులో 9.2, కోవెలకుంట్లలో 9.1, పెద్దకొప్పుర్లలో 9.1, వెలగటూరులో 8.9,  రుద్రవరంలో 9.7, రుద్రవరం మండలం ఎర్రగుడిదిన్నెలో 9.9, అవుకు మండలం ఉప్పలపాడులో 10, మిడుతూరులో 10, తుగ్గలి మండలం పగిడిరాయిలో 8.9, ఉయ్యలవాడ మండలం కాకరవాడలో 9.2, సంజామల మండలం నొస్సంలో 9.7, హాలహర్విలో 9, ఎమ్మిగనూరు మండలం దైవందిన్నెలో 9, వెలుగోడు మండలం పంగిడిగూడెంలో 8.9 ప్రకారం పీహెచ్‌ ఉన్నట్లు స్పష్టమవుతోంది.  

తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు
నీటిలో లవణాలు ఇతర అన్ని రకాల గుణాలు.. మోతాదు వరకు ఉంటే మంచిది. అటువంటి నీరు తాగడానికి, సాగుకు అనువుగా ఉంటుంది. నీటిలో ప్రధానంగా 9 రకాల గుణాలు ఉంటాయి.  ఇవి మోతాదుకు మించితే నష్టమే. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  మోతాదుకు మించినపుడు మిక్స్‌డ్‌ వాటర్‌ మేనేజ్‌మెంటు విధానం పాటించాలి. అంటే భూగర్భ జలాలకు ఉపరితల జలాలను కలిపి వినియోగించుకుంటే వీటి తీవ్రతను కొంత వరకు తగ్గించుకోవచ్చు. వివిధ గ్రామాల్లో ప్లోరైడ్‌ ప్రభావం ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనిని తగ్గించుకోవడానికి ఫిల్టర్‌ చేసుకోవాలి. భూగర్భజలశాఖ నీటి నాణ్యత ప్రమాణాలపై పరీక్షలు నిర్వహించి సంబంధిత శాఖల అధికారులకు పంపుతున్నాం. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపైనే ఉంది.– రఘురామ్, డీడీ, భూగర్భ జల శాఖ, కర్నూలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement