సాక్షి, అమరావతి: ఒక లీటర్ నీటిలో 0.01 మిల్లీగ్రాముల పరిమాణంలో ‘ఆర్శనిక్’ ధాతువులు ఉంటే వాటిని విషంగా పరిగణిస్తారు. అలాంటిది ఒక లీటర్ నీటిలో 0.02 నుంచి 0.05 మిల్లీగ్రాముల పరిమాణంలో ఆర్శనిక్ మూలాలు ఉంటే.. ఆ నీటిని కాలకూట విషంగా భావిస్తారు. ఆ నీటిని తాగినా, నిత్యావసరాలకు వినియోగించుకున్నా చర్మ, జీర్ణాశయ, కాలేయ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ల బారినపడక తప్పదు. రాష్ట్రంలో ఆర్శనిక్ ధాతువుల ప్రభావం వల్ల కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో భూగర్భ జలాలు భారీ ఎత్తున కలుషితమైనట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధ్యయనంలో వెల్లడైంది. మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పాత నల్గొండ జిల్లా పరిధిలోనూ భూగర్భ జలాల్లో మోతాదుకు మించి ఆర్శనిక్ మూలాలు ఉన్నట్లు తేలింది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లోని గంగానదీ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఆర్శనిక్ మూలాలు అత్యధిక స్థాయిలో ఉన్నట్లు సీడబ్ల్యూసీ పేర్కొంది. భూగర్భ జలాల్లో ఆర్శనిక్ ధాతువులు అధిక మోతాదులో ఉన్న ప్రాంతాల్లో తాగునీరు, నిత్యావసరాలకు నదీ జలాలను సరఫరా చేయాలని సీడబ్ల్యూసీ ప్రతిపాదించింది. కాగా, దేశంలో ఉపరితల, భూగర్భ జలాలపై సీడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో భాగీరథి (గంగా) నదీ పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాల్లో ఆర్శనిక్ మూలాలు ఉన్నట్లు 1980లోనే సీడబ్ల్యూసీ గుర్తించింది. ఆర్శనిక్ విషతుల్యమైన పదార్థం. కఠిన శిలాజాల్లో ఆర్శనిక్ మూలకం ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో తక్కువ
ఇటీవల దేశవ్యాప్తంగా భూగర్భ జలాలపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, అసోం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగా సహా 20 రాష్ట్రాల్లోని 98 జిల్లాల్లో ఆర్శనిక్ ధాతువు వల్ల భూగర్భ జలాలు కలుషితమైనట్లు తేల్చింది. భూగర్భ జలాల కలుషిత ప్రభావం ఉత్తర భారతదేశంతో పోల్చి చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉంది. దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో రాయచూర్, యాద్గిర్ జిల్లాల్లో భూగర్భ జలాల్లో ఆర్శనిక్ ధాతువు మోతాదు అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తేల్చింది. రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భూగర్భ జలాల్లో ఆర్శనిక్ మూలాల మోతాదు అధికంగా ఉంది. గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఒక లీటర్ నీటిలో 0.02 మిల్లీగ్రాములు.. గుంటూరు రూరల్ మండలంలో లీటర్ నీటిలో 0.01 మిల్లీగ్రాముల చొప్పున ఆర్శనిక్ ఉన్నట్లు వెల్లడైంది. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం రతనలో ఒక లీటర్ నీటిలో 0.02 మిల్లీగ్రాములు.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం కష్టంపహాడ్‌లో 0.03 మిల్లీగ్రాముల చొప్పున ఆర్శనికధాతువులు ఉన్నట్లు తేలింది. తెలంగాణలోని పాత నల్గొండ జిల్లా పరిధిలోని సూర్యాపేటలో లీటర్ భూగర్భ జలంలో 0.02 మిల్లీగ్రాములు, చివెములలో 0.01 మిల్లీగ్రాముల వంతున ఆర్శనిక్ మూలాలు ఉన్నట్లు స్పష్టమైంది. భూగర్భ జలాల్లో మోతాదుకు మించి ఆర్శనిక్ ఉండటంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలి
ఆర్శనిక్ మోతాదుకు మించి ఉన్న నీటిని నిత్యావసరాలకు వినియోగించినా చర్మ, జీర్ణాశయ, కాలేయ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడాల్సిందేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆర్శనిక్ ధాతువు వల్ల భూగర్భ జలాలు కలుషితమైన ప్రాంతాల్లో నదీ (ఉపరితల) జలాలను నిత్యావసరాల కోసం సరఫరా చేయాలని కేంద్ర జలసంఘం నివేదిక ఇచ్చింది. భూ ఉపరితలానికి వంద మీటర్ల లోతు వరకే ఆర్శనిక్ ప్రభావం ఉంటుంది. నదీ జలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో 200 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు బోరు బావిని తవ్వి.. భూగర్భ జలాలను వెలికి తీసి.. వాటిని పరీక్షించి.. ఆర్శనిక్ ధాతువుల ప్రభావం లేదని నిర్ధారించాకనే వాటిని నిత్యావసరాల కోసం సరఫరా చేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment