
విద్యార్థినిని పరీక్షిస్తున్న వైద్య సిబ్బంది
సాక్షి, నిజామాబాద్ : గురుకులాల్లో పెడుతున్న ఆహారం నాణ్యమైనదేనా..? పౌష్టికాహారం పేరుతో నాసిరకం భోజనం పెడుతున్నారా..? అసలు గురుకులాల్లో ఏం జరుగుతోంది. రెండు రోజుల క్రితం బిచ్కుంద మండలంలోని మైనారిటీ గురుకులంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మరువక ముందే.. మరో గురుకులంలో అచ్చం ఇదే తరహా పరిస్థితి పునరావృతమైంది. నిజామాబాద్ శివారులోని నాగారంలో గల గిరిజన డిగ్రీ గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో 62 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు కడుపునొప్పితో విలవిల్లాడి పోయారు. దీంతో వారిని హుటాహుటినప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఒకే తరహా ఘటనలు జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
రెండ్రోజుల్లో రెండు ఘటనలు..
కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలంలో గల మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం కలుషిత ఆహారం తిని 70 మంది ఆస్పత్రి పాలయ్యారు. నిజామాబాద్ నగర శివారులోని గొల్లగుట్ట తండా ప్రాంతంలో గల గిరిజన మహిళా డిగ్రి కళాశాలలో శనివారం రాత్రి భోజనం చేసిన 62 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
నాణ్యతపై అనుమానాలు..
నిజామాబాద్ జిల్లాలో ఐదు, కామారెడ్డిలో ఎనిమిది కలిపి ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 గిరిజన సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 25 మైనార్టీ గురుకులాలలు ఉన్నాయి. ఇందులో బాలుర–13, బాలికల గురుకులాలు–10, రెండు బాలుర ఇంటర్ బాలుర కళాశాలలున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. దీంతో గురకులాల్లో పెట్టే ఆహార నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకంగా ఆహారాన్ని అందించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నాసిరకం వస్తువులు..
గురుకులాల్లో నాసిరకం వస్తువులు వినియోగిస్తున్నాయి. తాజా కూరగాయలు వినియోగించడం లేదు. గిరిజన గురుకులంలోని కిచెన్‌లో పరిశీలిస్తే ఆలుగడ్డలకు మొలకలు వచ్చి ఉన్నాయి. వీటీతోనే శనివారం ఆలు బజ్జీలు వేయించి విద్యార్థినులకు స్నాక్స్ పెట్టారు. అలాగే, టమాటలు సైతం కుళ్లి పోయి, వాటిపై చిన్నపాటి పురుగులు వాలుతున్నాయి. దోసకాయలు బాగా లేవు. పరిసరాలు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయి. కారం, ఇతర సరుకులు కూడా నాసిరకమైనవి వినియోగిస్తున్నారు. బిచ్కుంద మైనారిటీ గురుకులంలోనూ కుళ్లిపోయిన గుడ్లను విద్యార్థులకు పెట్టారు. నాసిరకం కూరగాయలు సరఫరా చేస్తున్నట్లు విద్యార్థులే చెబుతున్నారు. గురుకుల్లో నాసిరకమైన ఆహారాన్ని అందించడం వల్లే విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయి.
తల్లిదండ్రుల ఆందోళన..
నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని గురుకులాల్లో అందిస్తారనే భావన తల్లిదండ్రుల్లో ఉంది. అయితే, రెండు రోజుల వ్యవధిలో రెండు గురుకులాల్లో ఒకే రకమైన ఘటనలు జరగడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు వాంతులు చేసుకున్న వెంటనే ఆస్పత్రులకు తరలించడంతో ఎవరికి ఏం జరగలేదు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఎవరు బాధ్యులు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.
గొల్లగుట్టలోని గిరిజన గురుకులం
గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్!
నిజామాబాద్ : గిరిజన రెసిడెన్షియల్ కళాశాల వసతి గృహంలో కలుషిత ఆహారం కారణంగా 62 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు!. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం గొల్లగుట్ట ప్రాంతంలో గల గిరిజన రెసిడెన్షియల్ కళాశాల వసతి గృహంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థులు కడుపునొప్పితో విలవిల్లాడారు. దీంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్.. ఘటనపై విచారణకు ఆదేశించారు. గొల్లగుట్ట ప్రాంతంలో గిరిజన గురుకుల హాస్టల్‌లో 292 మంది విద్యార్థినులు ఉంటున్నారు. గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ జన్మదినం కావడంతో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విద్యార్థులకు ప్రత్యేకంగా సేమియా చేసి పెట్టారు. అలాగే, పకోడి వడ్డించారు. రాత్రి 9 గంటల సమయంలో విద్యార్థినులు భోజనం చేశారు. అయితే, అరగంట తర్వాత వారికి కడుపు నొప్పి మొదలైంది. 62 మందికి తీవ్రమైన కడుపు నొప్పి రావడం, అందులో 10 మంది వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన సిబ్బంది.. హుటాహుటిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు.. ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. విద్యార్థుల అస్వస్థతకు భోజనమే కారణమై ఉంటుందని వారు పేర్కొన్నారు.
భోజనంపై కలెక్టర్ ఆరా..
కలెక్టర్ రామ్మోహన్‌రావు ఆదివారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి విద్యార్థినులను పరామర్శించారు. హాస్టల్‌లో భోజనం ఎలా ఉంటుంది.. పౌష్టికాహారం పెడుతున్నారా? అని ఆయన అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. విద్యార్థులు రాత్రి చేసిన భోజనం శాంపిల్స్ సేకరించాలని సూచించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment