
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ దీపికాపాటిల్
సాలూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తాగి కొడుతున్నాడన్న కారణంగా తల్లిదండ్రులు, దగ్గర బంధువు సాయంతో భార్యే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పార్వతీపురం ఏఎస్పీ దీపికాపాటిల్ తెలిపారు. శుక్రవారం ఆమె స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ ఇలియాజ్ మహ్మద్‌తో కలిసి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పాచిపెంట మండలం బుర్రమామిడివలస గ్రామ సమీపంలో కొండపై ఒడిశాకు చెందిన తిరుపతిగౌడ చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించాడు. దీంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావించి స్థానికులు దహన సంస్కారాలు చేశారు. అయితే విషయం ఆలస్యంగా తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో గుట్టు బయటపడింది.
బొర్రమామిడివలస గ్రామానికి చెందిన పాగి సోములమ్మ, ఒడిశాకు చెందిన తిరుపతి గౌడ ప్రేమించి, పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. అయితే సోములమ్మ తల్లిదండ్రులు వివాహాన్ని వ్యతిరేకించడంతో కులపంరంగా 10 వేల రూపాయల తప్పు కట్టి తిరుపతి గౌడ అత్తవారింటిలోనే జీవనం సాగిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా తిరుపతి ప్రతిరోజూ తప్పతాగి వచ్చి సోములమ్మను కొట్టేవాడు.
ఈ క్రమంలో ఇటీవల గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో వరుసకు సోదరుడైన వ్యక్తితో సోములమ్మ డ్యాన్స్ చేసిందన్న కారణంతో తిరుపతి గౌడ ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన సోములమ్మ భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఎలాగైనా అతడ్ని మట్టుబెట్టాలని భావించి తల్లిదండ్రులైన పాగి వెంకటి, జానకమ్మలకు తెలియజేసింది.
దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 8న సోములమ్మ, ఆమె తల్లిదండ్రులు వెంకటి, జానకమ్మ, దగ్గరి బంధువు తిరగల లక్ష్మణ్‌లు కలిసి ఇంటిలోనే తిరుపతిగౌడను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలో ఉన్న కొండపైకి తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. కొద్దిరోజుల తర్వాత కుక్కల అరుపులతో అక్కడికి వెళ్లిన గ్రామస్తులు చెట్టుకువేలాడుతున్న మృతదేహాన్ని కిందికి దించి దహనసంస్కారాలు చేశారు.
కొద్ది రోజుల తర్వాత తిరుపతి గౌడ మరణవార్త తెలియడంతో అతని కుటుంబ సభ్యులు గ్రామాని కి వచ్చి సోములమ్మ కుటుంబ సభ్యులను నిలదీశారు. మరణవార్త తమకెందుకు తెలియజేయలేదని ప్రశ్నించగా వారి నుం చి సరైన సమాధానం రాలేదు. దీంతో మృ తుని కుటుంబ సభ్యులు పాచిపెంట పోలీ సులకు మే 2వ తేదీన ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా పూర్తి వివరాలు బయటకువచ్చాయి.