రాజ్‌కుమార్ చంటి మృతదేహం
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితిలో ప్రజలంతా మంగళవారం అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల్లో నిమగ్నమై ఉండగా, ఓ దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి తన భర్తనే హత్య చేసిందో ప్రబుద్ధురాలు. మునిగుడ సమితి ఆఫీస్‌లో తాత్కాలిక డ్రైవరుగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ చంటి జీరో నైట్ ముగించుకుని రాత్రి 2 గంటలకు సొంతింటికి చేరుకున్నాడు. అదే సమయంలో తన భార్య నివేదిత నాయక్ ప్రియుడితో కలిసి ఉండడాన్ని చూశాడు. దీంతో కోపోద్రేకుడైన రాజ్‌కుమార్ భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్షణ పెరిగి తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో నివేదిత నాయక్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేశారు. వంటింట్లో ఉన్న రొట్టెలకర్ర, పీఠ చెక్కతో రాజ్‌కుమార్ చంటిపై ఇద్దరూ కలిసి దాడి చేసి చంపేశారు. హత్య అనంతరం అతడి మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి, ప్రియుడి కారులో గజపతి జిల్లాలోని ఒడవ ప్రాంతానికి తరలించారు. అక్కడి రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేసి ఇద్దరు కలిసి తిరిగి కారులో ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు.
మునిగుడ తహసీల్దారు కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న నివేదిత తన భర్త కనిపించడం లేదంటూ మునిగుడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఒడవ ప్రాంతంలో ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంఘటన స్థలాన్ని క్షణ్నంగా పరిశీలించి, పలు ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ ఆధారాలతో నివేదిత నాయక్‌ను ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజ్‌కుమార్ చంటి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment