అమర్‌బాబు మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ
జిల్లాలో వేర్వేరు చోట్ల శనివారం విద్యుదాఘాతానికి గురై నలుగురు మృతి చెందారు. పొదిలి మండలం మామిళ్లపల్లికి చెందిన పెద్ద యోగయ్య (67), కురిచేడు మండలంలోని గంగదొనకొండకు చెందిన గండి కోటేశు (23), కొరిశపాడు మండలం తమ్మవరానికి చెందిన దేవరపల్లి అమర్‌బాబు (23). కొత్తపట్నం మండలం మోటుమాలకు చెందిన పురిణి నరసింహ (14)విద్యుత్ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు.
జిల్లాలో వేర్వేరు చోట్ల ఘటనలు..
పొదిలి : జిల్లాలో శనివారం వేర్వేరు చోట్ల విద్యుదాఘాతానికి గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నిరుగా విలపిస్తున్నారు. ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి ఓ వృద్ధుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కాటూరివారిపాలెం సమీపంలోని ఓ మిల్క్ లైన్‌లో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మామిళ్లపల్లి పెద్ద యోగయ్య (67) మిల్క్‌లైన్‌లో పని చేస్తుంటాడు. ఆవరణలో ఉన్న కొలనును నీటితో నింపేందుకు మోటార్ ఆన్ చేశాడు. పైపులు తగిలించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడి పెద్ద యోగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో యువకుడు కూడా..
కురిచేడు : విద్యుదాఘాతానికి గురై మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మండలంలోని గంగదొనకొండలో శనివారం ఉదయం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గండి కోటేశు (23), ఆయన భార్య జ్యోతిలు ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో ఉన్నారు. ఉక్క పోస్తుండటంతో టేబుల్ ఫ్యాను పెట్టుకున్నారు. ఫ్యాన్ వైరుకు ఉన్న జాయింట్ వద్ద కోటేశు చేయి తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కంగారులోవ భర్తను పట్టుకోవడంతో జ్యోతి కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఆమె పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు తీసి చూసే సరికి ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై ఉన్నారు. స్థానికుడు జయరావు గమనించి జ్యోతిని కర్రతో బలంగా లాగాడు. ఆమె గాయాలతో బయటపడగా కోటేశు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లి, తండ్రి, తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
ఇంకొక యువకుడు కూడా..
మేదరమెట్ల : విద్యుదాఘాతానికి గురై ఇంకొక యువకుడు కూడా మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని తమ్మవరంలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన దేవరపల్లి అమర్‌బాబు (23) బేల్దారి పనులతో పాటు కరెంటు పైపులు కోసే పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. గ్రామంలోని ఓ ఇంట్లో విద్యుత్ యంత్రంతో గాడులు కొడుతున్నాడు. కరెంటు లేదనుకొని వైర్లు పట్టుకోవడంతో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే పడిపోయాడు.
సహచరులు అతడిని హుటాహుటిన మేదరమెట్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా అమర్‌బాబు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న కొరిశపాడు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును సహచర కూలీలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి తల్లి, సోదరుడు ఉన్నాడు. ఏడాది క్రితమే తండ్రి మరణించాడు. చేతికి అందివచ్చిన కుమారుడు మరణించడంతో తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది.
మోటుమాలలో బాలుడు..
మోటుమాల (కొత్తపట్నం) : విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మోటుమాలలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పురిణి నరసింహ (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. బాలుడి స్వగ్రామం నెల్లూరు జిల్లా పంట అల్లూరు. ఏడాది క్రితం అమ్మమ్మ ఇంటికి మోటుమాల వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే చదువుతున్నాడు. పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత పొలంలో గేదెలు మేపుతున్న తాత నాటారు వెంకయ్యకు భోజనం ఇచ్చేందుకు వెళ్లాడు. ఆ తర్వాత బాలుడికి తాటి ముంజలు తినాలని కోరిక కలిగింది.
పొలంలో ఉన్న తాటి చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించి విఫలం చెంది 20 అడుగుల అల్యూమినియం పైపుతో తాటి కాయలు కోసేందుకు ప్రయత్నించాడు. తాటి చెట్టుపైన ఉన్న 11 కేవి విద్యుత్ తీగలపై పైపు పడింది. పైపునకు బిగించి ఉన్న కొక్కేం విద్యుత్ తీగకు తగులుకుంది. విద్యుదాఘాతానికి గురై బాలుడు నరసింహ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి స్థానిక ఎస్‌ఐ సీహెచ్ శివబసవరాజు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించాడు. వివరాలు సేకరించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోస్టమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment