కాటేసిన కరెంట్‌ | Four Members Died By Electric Shock | Sakshi
Sakshi News home page

కాటేసిన కరెంట్‌

Jul 21 2018 12:13 PM | Updated on Sep 5 2018 2:28 PM

Four Members Died By Electric Shock - Sakshi

 సారంగపాణి, మానస మృతదేహాలు రాయపర్తి:  మృతిచెందిన వెంకట్‌రెడ్డి, కొంరయ్య  

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుదాఘాతంతో శుక్రవారం నలుగురు మృతి చెందారు. కమలాపూర్‌ మండలం దేశరాజుపల్లిలో ఉతికిన బట్టలు ఆరేస్తుండగా మహిళ,  కేసముద్రం మండలం ధన్నసరిలో లారీ క్యాబిన్‌కు విద్యుత్‌ తీగలు తగిలి లారీ డ్రైవర్,  రాయపర్తి మండలం తిర్మలాయపల్లిలో ఫెన్సింగ్‌ తీగలకు కరెంట్‌ పాసై ఓ రైతుతో పాటు పాలేరు మృతి చెందారు. కరెంట్‌షాక్‌తో మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది.

కమలాపూర్‌(హుజూరాబాద్‌): ఉతికిన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇమ్మడి మానస (22) అనే వివాహిత మృతి చెందిన ఘటన కమలాపూర్‌ మండలంలోని దేశరాజుపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బంధువుల కథనం ప్రకారం.. దేశరాజుపల్లికి చెందిన రొంటాల రమేష్, శారద దంపతుల చిన్న కూతురు మానస. సుమారు ఏడాదిన్నర క్రితం ధర్మసాగర్‌ మండలం రాపాకపల్లికి చెందిన ఇమ్మడి ప్రదీప్‌తో మానస వివాహం జరిగింది.

వీరికి ఐదు నెలల బాబు ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం మానస దేశరాజుపల్లిలోని తల్లిగారింటికి వచ్చింది. ఇటీవల ప్రసవించిన తమ పెద్ద కూతురు వద్దకు శారద వెళ్లగా శుక్రవారం రమేష్‌ వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఇంటి వద్ద ఉన్న మానస బట్టలు ఉతికి ఇంటిముందు ఉన్న ఇనుప తీగపై ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు ఆ ఇనుప తీగకు విద్యుత్‌ సరఫరా అయి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

మృతురాలికి భర్త, ఐదు నెలల బాబు ఉన్నారు. మానస మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. విద్యుదాఘాతం రూపంలో తల్లిని కోల్పోయిన ఐదు నెలల బాబును చూసి అయ్యో బిడ్డా.. అంటూ ప్రతి ఒక్కరు కంట తడి పెట్టారు. మానస మృతితో దేశరాజుపల్లి, రాపాకపల్లి గ్రామాల్లో  విషాదం చోటు చేసుకుంది.

ధన్నసరిలో లారీ డ్రైవర్‌..

కేసముద్రం: యూరియాలోడు లారీకి విద్యుత్‌ తీగలు తాకడంతో విద్యుతాఘాతానికి గురైన ఓ లారీ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన మండలంలోని ధన్నసరి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై సతీష్‌ తెలిపిన ప్రకారం.. ఖిలావరంగల్‌ మండలం కరీమాబాద్‌కు చెందిన సిరికొండ సారంగపాణి(52) అనే సీనియర్‌ డ్రైవర్‌ కేసముద్రం మండలంలోని ధన్నసరి పీఏసీఎస్‌కు మార్క్‌ఫెడ్‌ సంస్థ కెటాయించిన యూరియా బస్తాలను వరంగల్‌ ఎన్‌డీఆర్‌ గోదాం నుంచి లారీలో కేసముద్రంకు తీసుకువచ్చాడు.

ఈ మేరకు ధన్నసరి గ్రామంలో గల గోడౌన్‌లో బస్తాలను దించేందుకు ఇక్కడి సిబ్బంది ఆ లారీని ధన్నసరికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గోడౌన్‌ వద్ద లారీని వెనక్కి తిప్పే క్రమంలో విద్యుత్‌ తీగలు లారీ క్యాబిన్‌కు తాకాయి. ఈ క్రమంలో లారీడ్రైవింగ్‌ చేస్తున్న సారంగపాణి హడావుడిగా కిందకు దిగుతూ నేలపై కాలు పెట్టడంతో విద్యుతఘాతానికి(ఎర్త్‌ కావడంతో) గురై అక్కడికక్కడే మృతి చెందాడు.  మృతుడికి భార్య వినోద, కూతురు సంధ్య ఉన్నారు.  భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు.

ఫెన్సింగ్‌ తీగలు తాకి ఇద్దరు..

రాయపర్తి : ఫెన్సింగ్‌ తీగలు  తాకి ఓ రైతుతో పాటు పాలేరు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాయపర్తి మండలంలోని తిర్మలాయపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... అర్బన్‌ జిల్లాకు చెందిన నూకరాజు పాపరాజు తిర్మలాయపల్లిలో ఏడున్నర ఎకరాల మామిడితోటను కొనుగోలు చేసి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది గ్రామానికి చెందిన శీల మధుసూదన్‌రెడ్డి మామిడితోటను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు.

ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మామిడితోటలోని బోరుకు కరెంట్‌ తీగలను ఫెన్సింగ్‌ తీగలకు తాకుతూ అమర్చారు. గాలికి అటూఇటూ తాకుతూ రాపిడై తీగలకు కరెంట్‌ పాసైంది. ప్రతి రోజు తాగునీటి కోసం పక్కనే తనకున్న నాలుగు ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్న జినుగు వెంకట్‌రెడ్డి (46) మామిడితోటలోకి నీళ్లు తెచ్చుకోవడం కోసం భార్య మంజులతో చెప్పి ఫెన్సింగ్‌ తీగలను దాటే క్రమంలో కరెంట్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇదిలా ఉండగా శీల మధుసూదన్‌రెడ్డికి పాలేరుగా పనిచేసే వశపాక కొంరయ్య(45) పరుగున వచ్చి ఫెన్సింగ్‌ను దాటుకొని వద్దామని ప్రయత్నించగా వాటికి అంటుకొని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఒక్కసారిగా ఇద్దరు ప్రాణాలు బలిగొన్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఒక్కసారిగా ఇద్దరి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మామిడితోట యజమాని నూకరాజు పాపరాజు, కౌలురైతు శీల మధుసూదన్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లే తన భర్తతో పాటు కొంరయ్య మృతి చెందారని మృతుడు వెంకటర్‌రెడ్డి భార్య ఆరోపించారు. మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. సంఘటన స్థలానికి వర్ధన్నపేట సీఐ వేణుచందర్, ఎస్సై ఉపేందర్‌రావులు చేరుకుని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement