
శ్రీనగర్/న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ఉగ్రవాదులు అమర్చిన శక్తివంతమైన బాంబుపేలి నలుగురు పోలీసులు అసువులు బాశారు. బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో మూడో బెటాలియన్‌కు చెందిన రిజర్వు పోలీసులు పెట్రో లింగ్ చేపట్టారు. ఉదయం వారు స్థానిక మార్కెట్ ప్రాంతంలోని మూసి ఉన్న దుకాణం వద్దకు రాగానే అప్పటికే అమర్చి ఉంచిన అత్యాధునిక పేలుడు పదార్థం (ఐఈడీ)ను ఉగ్రవాదులు రిమోట్ సాయంతో పేల్చారు. దీంతో నలుగురు పోలీసులు చనిపోగా ఇద్దరు గాయపడ్డారు.
ఈ ఘటనకు తామే కారణమని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. మృతులను ఏఎస్సై ఇర్షాద్ అహ్మద్(దోడా), కానిస్టేబుళ్లు గులాం నబీ(బారాముల్లా), పర్వాయిజ్ అహ్మద్(హంద్వారా), మహ్మద్ అమిన్(కుప్వారా)గా గుర్తించారు. కాగా, భద్రతా సిబ్బంది ప్రాణాలు కాపాడటంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్‌పై దాడులు జరగని రోజంటూ లేకుండాపోయిందని పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్‌శర్మ విమర్శించారు. కశ్మీర్ సీఎం మెహబూబా ఈ దాడిని ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment