వంతెనపై పట్టాల పక్కన ఉంచిన మహిళల మృతదేహాలు
జయపురం/మల్కన్‌గిరి : ఛత్తీస్‌గడ్‌లో మావో ప్రభావిత ప్రాంతం దంతేవాడ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. రైల్వే వంతెన పైనుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను రైలు ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. వివరాలు ఇలా వున్నాయి... దంతేవాడ ప్రాంతంలోని కుపేర్ గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలు కర్రలు(వంట చెరకు) తెచ్చుకునేందుకు పరిసర ప్రాంతాలకు ఆదివారం వెళ్లారు. తిరిగి వీరు మధ్యాహ్నం వేళ కర్రలు పట్టుకుని సంకిని-డాంకిని నదిపై ఉన్న రైల్వే వంతెన పైనుంచి ట్రాక్‌పై నడుచుకుంటూ గ్రామానికి వస్తున్నారు.
వీరు వంతెనకు మధ్యలో ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా గూడ్స్ రైలు వచ్చింది. ఆ సమయంలో వారు వెనక్కి వెళ్లాలో, ముందుకు వెళ్లాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. తప్పించుకునేందుకు వీలులేక రైలుకు దొరికిపోయారు. రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. అయితే మరో ఇద్దరు మహిళలు గూడ్స్ రైలును చూసి ప్రాణాలకు తెగించి నదిలోకి దూకేయడంతో వారి ప్రాణాలు దక్కాయి. దంతేవాడ నుంచి కరళీ గ్రామానికి వెళ్లే మార్గంలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది.
సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు, జవాన్లు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను రైల్వే ట్రాక్ మీద నుంచి వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే మహిళలు రైల్వే వంతెన మీదుగా నడుస్తున్న సమయంలో రైలు రావడంతో వారు ప్రమాదం నుంచి తప్పించుకోలేక పోయారని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment