వారంతా యువకులు..జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు..తమ అభిమాన నేత పవన్‌కల్యాణ్ వస్తున్నారని తెలిసి ఉత్సాహంగా అనంతపురం వెళ్లారు. కవాతులో కదంతొక్కారు. తిరుగు ప్రయాణంలో ఇంకొన్ని నిమిషాల్లో గడిస్తే ఇంటికి చేరుకునే వారు..అయితే డోన్ సమీపంలోని సర్కిల్‌లో ఓ ప్రైవేట్ బస్సు మృత్యువులా దూసుకొచ్చింది. యువకులు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో యువకుడు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నాడు.
కర్నూలు, డోన్ రూరల్: డోన్ పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై యూ.కొత్తపల్లె సర్కిల్ వద్ద ఆదివారం రాత్రి 10గంటల సమయంలో కారును ప్రైవేట్ బస్సు ఢీకొనింది. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. డోన్ పట్టణానికి చెందిన ఏపీ02ఏజెడ్2786 నంబర్ కారులో డోన్ మండలం ధర్మవరం, వెల్దుర్తి మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన నలుగురు యువకులు అనంతపురం పట్టణంలో ఆదివారం జరిగిన జనసేన కవాత్‌లో పాల్గొన్నారు. తిరిగి డోన్ పట్టణానికి చేరుకునే సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూర్ వైపు వెళుతున్న కేఎల్07సీటీ2708 అనే ప్రైవేట్ ట్రావెల్ బస్సు కొత్తపల్లె సర్కిల్ వద్ద ఢీకొంది.
ఈ ఘటనలో గోవర్ధనగిరి గ్రామానికి చెందిన హనుమంతు (31), గోవిందు (29), మౌలాలి(31), ధర్మవరానికి చెందిన మధు (32) అక్కడికక్కడే మృతి చెందారు. డోన్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ మల్లికార్జున తీవ్రంగా గాయపడడంతో పోలీసులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ ఫక్కీరప్ప, డోన్ డీఎస్పీ ఖాధర్ బాషా, సీఐలు కళా వెంకటరమణ, రాజగోపాల్ నాయుడు, ఎస్‌ఐలు నరేంద్రకుమార్ రెడ్డి, సునీల్ కుమార్‌లు సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతులను పోస్టు మార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో ధర్మవరం గ్రామానికి చెందిన మధు కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మధు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. హనుమంతు మీసేవ కార్యాలయంలోæ పనిచేస్తున్నాడు. గోవిందు, మౌలాలి ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నారు. మృతి చెందిన వారంతా యువకులు కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం నిండుకుంది.
Comments
Please login to add a commentAdd a comment