
నకిలీ బంగారుహారం
అమీర్‌పేట: పొలంలో పని చేస్తుండగా బంగారు హారం దొరికిందని చెప్పి ఇద్దరు అగంతకులు ఓ వ్యక్తిని నమ్మించి అతడి వద్ద నుండి రూ. 9 లక్షలు కాజేసిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.మధురానగర్‌కు చెందిన వై.కె.రమణారెడ్డి పండ్ల రసాల వ్యాపారం చేసేవాడు. ఇటీవల అతని వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమను శివాజీ, మాధవ్‌గా పరిచయం చేసుకున్నారు.
తాము పొలాల్లో జేసీబీతో పనులు చేయిస్తుంటామని, ఇటీవల పని చేస్తుండగా 1250 గ్రామల బంగారు హారం దొరికిందని, తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున హారాన్ని విక్రయిస్తున్నట్లు తెలిపారు. అందులోని చిన్న ముక్కను రమణరెడ్డికి ఇచ్చి అనుమానం ఉంటే పరీక్షించుకోవాలని సూచించారు. దీంతో అతను నగల దుకాణంలో పరీక్షించగా అది బంగారమేనని నిర్ధారణ అయ్యింది. దీంతో వారి మాటలు నమ్మి న రమణారెడ్డి తనకు కొంత గడువు ఇస్తే హారాన్ని కొనుగోలు చేస్తానని తెలిపాడు. అందుకు అంగీకరించి న వారు ఈ నెల 14న రమణారెడ్డికి ఫోన్ చేసి రూ. 9 లక్షలు ఇస్తే హారం ఇచ్చేస్తామని బేరం పెట్టారు. దీంతో అతను వారు అడిగిన మొత్తాన్ని చెల్లించి హారం కొనుగోలు చేశాడు. సోమవారం దానిని బంగారు నగల దుకాణానికి తీసుకువెళ్లి పరీక్షించగా హారం నకిలీదిగా తేలింది. దీంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.