పిల్లలు కలగలేదా.. మేం ఆయుర్వేద వైద్యులం.. | Fraud With Pregnancy Medicine in YSR Kadapa Kazipet | Sakshi
Sakshi News home page

పిల్లలు పుట్టేందుకు మందులు ఇస్తామంటూ టోకరా

Feb 19 2020 12:37 PM | Updated on Feb 19 2020 12:37 PM

Fraud With Pregnancy Medicine in YSR Kadapa Kazipet - Sakshi

హర్ష (మోసగాడు)

కడప, ఖాజీపేట : మీకు పెళ్లయి చాలా కాలం అయిందా.. మీకు పిల్లలు కలగలేదా.. సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నారా.. అయితే మేం  కేరళ ఆయుర్వేద వైద్యులం.. మా దగ్గర ఉన్న ఆయుర్వేద మందులు వాడండి 3 నెలల్లో మీకు సంతానం కలుగుతుంది.. అంటూ మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకెళ్లే మోసగాళ్లు జిల్లాలో సంచరిస్తున్నారు. తాజాగా ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన సురేష్, శాంతిలత దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరన్న విషయం గ్రామస్తుల ద్వారా నకిలీ వైద్యులు తెలుసుకున్నారు. వెంటనే వారి ఇంటి వద్దకు వెళ్లారు.  సురేష్‌ దంపతులతో హర్ష అనే పేరు గల వ్యక్తి తాము  కేరళకు చెందిన ఆయుర్వేద వైద్యులమని, తమ వద్ద మంచి ఆయుర్వేద మందులు ఉన్నాయని, తమకు  కడప, తిరుపతి ఇలా చాలా చోట్ల బ్రాంచ్‌లు ఉన్నాయని చెప్పారు. కొత్తగా కడపలో బ్రాంచ్‌ ప్రారంభించినందున ప్రచారం కోసం ఇలా గ్రామాలకు వచ్చామన్నారు. తాము చాలా మందికి మందులు ఇచ్చామని, అందరికి సంతానం కలిగిందని చెప్పారు. తమకు ఇప్పుడే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, సంతానం కలిగిన తరువాత పూర్తి డబ్బు ఇవ్వొచ్చు అంటూ వారితో మాట్లాడి నమ్మకం కలిగేలా చేశాడు. అలా వారికి నమ్మకం కలిగించిన తరువాత ఇంటిలోకి తీసుకు వెళ్లి గర్భ పరీక్షలు అంటూ కడుపు వద్ద ఏదో మిషన్‌ ఉంచి పరీక్షలు చేశాడు.

తరువాత మీరు ఇద్దరు ఈ రెండు మాత్రలు వేసుకోండి అంటూ ఇచ్చాడు. ఈలోగా వారికి కొద్దిగా మత్తుగా ఉన్నట్లు అనిపించింది. ఇంతలో మందులు కావాలంటే సుమారు రూ.40వేలు అవుతుంది ఇప్పుడు రూ.20 వేలు ఇవ్వండి మిగిలింది సంతానం కలిగిన తరువాత ఇవ్వండి అని చెప్పాడు. వెంటనే బాధితులు సంతానం పై ఉన్న మమకారంతో  వారి వద్ద ఉన్న రూ.20వేలు ఇచ్చారు. మీ వద్ద పట్టుచీరలు ఉంటే ఇవ్వండి వాటికి ఆయుర్వేద మందులు పట్టించి చర్చిలో ప్రార్థనలు చేసి ఇస్తాం అంటూ అడిగాడు. దీంతో వారు రెండు విలువైన పట్టుచీరలు ఇచ్చారు. ఈ క్రమంలోనే దంపతులు ఇద్దరు మత్తులోకి వెళ్లారు. వెంటనే అక్కడ నుంచి హర్ష అనే నకిలీ ఆయుర్వేద వైద్యుడు  బయటకు వచ్చి బయట ద్విచక్ర వాహనంలో తనకోసం వేచి  ఉన్న వ్యక్తి సహాయంతో అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మత్తు నుంచి తేరుకుని నకిలీ వైద్యుని చేతిలో మోసపోయామని గ్రహించిన బాధితులు ఖాజీపేట పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. అక్కడ సరైన రీతిలో వారికి సమాధానం రాక పోవడం, కేసు విషయంలో పోలీసులు స్పందించకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. తాము ఇచ్చిన పట్టు చీరల ఆధారంగా ఏదైనా చేతబడి చేస్తారేమో భయంతో వారు మంగళవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.  తమలాగా ఎవరూ మోసపోకూడదని, ఇలాంటి మోసగాళ్లను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతోనే తాము ఫిర్యాదు చేశామని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement