గంజాయి స్మగ్లింగ్‌ ముఠా అరెస్టు | Ganja Smuggling Gang Arrested At Mahabubnagar | Sakshi
Sakshi News home page

గంజాయి స్మగ్లింగ్‌ ముఠా అరెస్టు

Published Fri, Jan 24 2020 3:39 AM | Last Updated on Fri, Jan 24 2020 3:39 AM

Ganja Smuggling Gang Arrested At Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: విశాఖపట్నం నుంచి శ్రీలంకకు గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న ఒక ముఠాను మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 4న భూత్పూర్‌ మండలం తాటికొండ దగ్గర జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ ని హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వెళ్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. సంఘటన స్థలం పరిశీలించిన పోలీసులకు కారులో గంజాయి దొరికింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేశారు.

కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రెమా రాజేశ్వరి గురువారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. తమిళనాడులోని మధురైకి చెందిన సతీశ్, కల్యాణ్‌ గంజాయి స్మగ్లింగ్‌ చేస్తుంటారు.  ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన శివనేశ్వరన్, అజిత్, సురేందరన్‌లతో కలసి విశాఖపట్నం జిల్లాలో రాము, మూర్తి, రాంరెడ్డి అనే వ్యక్తుల వద్ద కేజీ రూ.6 వేలకు గంజాయి కొనుగోలు చేసి.. ఆ తర్వాత ఆ గంజాయిని హైదరాబాద్‌లో రూ.11వేలు, చెన్నైలో రూ.12 వేలకు విక్రయించేవారు.

రామేశ్వరం మీదగా శ్రీలంకకు సముద్రమార్గం ద్వారా ఎగుమతి చేసేవారు.  ఈ క్రమంలోనే వీరు గురువారం హైదరాబాద్‌ సమీపంలో సతీశ్, కల్యాణ్, సురేందరన్‌ ఉన్నారని పోలీ సులు సమాచారం తెలుసుకొని అరెస్టు చేశారు. వీరిలో సతీశ్, కల్యాణ్, సురేందరన్, అజిత్‌లను రిమాండ్‌కు తరలించారు. శివనేశ్వరన్, రాము, మూర్తి, రాంరెడ్డిలు పరారీలో ఉన్నారు. అరెస్టయినవారి నుంచి రూ.21లక్షల విలువ చేసే 180 కేజీల గంజాయి, రెండు ఇన్నోవా కార్లు సీజ్‌ చేశారు. గతంలో వీరు రెండు సార్లు గంజాయి కొనుగోలు చేసి రామేశ్వరంకు చెందిన జయచంద్రన్‌ అనే వ్యక్తి ద్వారా శ్రీలంకకు పంపించి విక్రయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement