
మృతి చెందిన బిడ్డను పరిశీలిస్తున్న డీఎస్పీ సౌమ్యలత, సిబ్బంది
శ్రీరంగరాజపురం: అమ్మఒడిలో ఆడుకోవాల్సిన ఐదు నెలల చిన్నారి.. నీటి డ్రమ్ములో శవమై తేలింది. ఈ ఘటన శ్రీరంగరాజపురం మండలం పిల్లిగుండ్లపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. శ్రీరంగరాజపురం మండలం మెదవాడ గ్రామానికి చెందిన భువనేశ్వరికి ఇద్దరు మగ బిడ్డలున్నారు. రెండో బిడ్డ కాన్పు కోసం గతేడాది అమ్మగారి ఊరైన పిల్లిగుండ్లపల్లి చేరుకుంది. రెండో బిడ్డ జన్మించి ప్రస్తుతం 5 నెలలు అయ్యింది. తల్లి భువనేశ్వరి తెలిపిన వివరాలు.. ‘‘మంగళవారం ఉదయం నా బిడ్డుకు పాలు తాపించిన వెంటనే ఇంటిలోని ఊయలలో పడుకోబెట్టాను. అనంతరం ఒక వైపు నేను, మరోవైపు నా అక్క రేవతి పడుకొని నిద్రలోకి జారుకున్నాం. 11 గంటల సయమంలో అక్క రేవతి నిద్రలేచి బాబు లేదని చెప్పింది.
వెంటనే బిడ్డ ఆచూకీ కోసం చుట్టు పక్కల వెతికాం. గ్రామంలో ప్రజలను విచారించాం. ఎక్కడా కనబడకపోవడంతో ఆందోళన చెందాం. ఈ కమంలో బంధువైన ఒక ఆమె ఇంటి పక్కనే నీటి డ్రమ్మును పరిశీలించాం. డ్రమ్ము మూత తీసి చూడగా.. చంటి బిడ్డ శవమై కనబడింది’’. దీనిపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హూటాహుటినా రంగంలోకి దిగిన ఎస్‌ఐ సుమన్ జరిగిన విషయాన్ని పుత్తూరు డీఎస్పీ సౌమ్యలతకు చేరవేశారు. ఆమె క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. వీటిద్వారా వివరాలు సేకరించిన అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ చంటిబిడ్డ హత్యను చేసిన వారిని విచారణలో గుర్తిస్తామన్నారు. కాగా చంటి బిడ్డ హత్య విషయం చుట్టు పక్కల పాకడంతో.. జనం తండోపతండాలుగా తరలివచ్చారు. సీఐ చల్లనిదొర నేతృత్యంలో పోలీసులు వివరాలు సేకరించారు. బిడ్డ హత్యకు గురి కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment