గిరిజన గూడెంలో విచారిస్తున్న అధికారులు
ప్రకాశం, పుల్లలచెరువు: పుల్లలచెరువు మండలంలోని గారపెంట గిరిజన గూడెంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి బాలిక గర్భం దాల్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఉలిక్కిపడ్డ ఆ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు బాలికకు గర్భం వచ్చిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేయగా బుధవారం వై పాలెంలోని సహాయ గిరిజన సంక్షేమాధికారి దస్తగిరి సదరు బాలిక తల్లిదండ్రులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి తల్లిదండ్రులు, గూడెం పెద్దలను పిలిపించి పాఠశాల సిబ్బంది సమక్షంలో సుదీర్ఘ విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థినికి ఇదే గూడెంకు చెందిన యాకసిరి చిరంజీవి అనే యువకుడితో కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తమ విచారణలో తెలసిందన్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా బాలిక పాఠశాలకు రాకపోవడంతో సిబ్బంది ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లి కారణాలు అడిగారు.
తమ కుమార్తె గర్భం దాల్సిన విషయం తెలిసిందని, దానిపై తమ కుల పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగిందందని తల్లిదండ్రులు చెప్పారన్నారు. మైనారిటీ తీరగానే కట్టుబాట్లు ప్రకారం వివాహం జరిగేలా కులపెద్దల పంచాయతీ చేశారని చెప్తున్నారు. ఈ విషయంలో పాఠశాల సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదని, మా బిడ్డను పదో తరగతి పరీక్షల కోసమే పాఠశాలకు పంపుతున్నట్లుగా తల్లిదండ్రులు చెప్పినట్లు దస్తగిరి తెలిపారు. గూడెం పెద్దలు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఇచ్చిన పూర్తి విచారణ నివేదికల వివరాలను జిల్లా అధికారులకు తెలియచేసి, వారి ఆదేశాలను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఆజాగ్రత్తగా ఉండే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంపై పాఠశాల సిబ్బందిని వివరణ కోరగా 2016లో జరిగిన ఘటన తర్వాత పాఠశాలలో రాత్రివేళ బాలికలు ఎవరినీ ఉండనీయకుండా తల్లిదండ్రుల అనుమతితో ఇంటికి పంపిస్తున్నామన్నారు. ఈ విషయం అధికారులకు కూడా తెలిపినట్లుగా చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, సిబ్బంది వెళ్లి గూడెంలోని పాఠశాల సిబ్బందిని, బాలిక, యువకుడి తల్లిదండ్రులను విచారించి నివేదికను అధికారులకు తెలియచేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment